హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్‌కుమార్, బొమ్మెర రామ్మూర్తి, సుర్వి యాదయ్యగౌడ్, లీగల్ సెల్ నాయకుడు సదానంద్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినికి ఫిర్యా దు చేశారు. ఖమ్మంలో ఓ మంత్రి ప్రభుత్వ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్లను రాజకీయంగా ప్రభావితం చేయాలని చూసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించి మంగళవారం పట్టణంలోని 17వ వార్డులో పర్యటించడంతోపాటు ఓటర్లతో సమావేశాలు నిర్వహించినట్టు మరో ఫిర్యాదును అందజేశారు. కాంగ్రెస్ డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రోత్సహిస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసినా.. క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ నిబంధనలకు పాతర వేస్తున్నారని ఆరోపించారు.