వచ్చే అసెంబ్లీలో గెలిచి తెలంగాణలో కూడా కర్ణాటక మాడల్‌ను అమలుచేస్తామం టున్నది కాంగ్రెస్ పార్టీ.. ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ పాలన అమలుచేసి తీరుతామని బీజేపీ రంకెలేస్తున్నది. ఇంతకూ కర్ణాటకలో ఏం జరుగుతున్నది? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలవుతున్నది. అప్పుడే పీత రాజకీయం మొదలైంది.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ నేతలు హూంకరిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నది. సందట్లో సడేమియా అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలోనివారు ఆ ప్రభుత్వానికే పొగబెడుతున్నారు. గత బీజేపీ సర్కారు ‘40 పర్సెంట్’ అవినీతి ముద్ర వేసుకొంటే.. నేటి కాంగ్రెస్ సర్కారు అంతకు మించి అన్నట్టు ’50 పర్సెంట్’ ప్రభుత్వంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ ఇప్పుడు ఆగమాగమై కుక్కలు చింపిన విస్తరిలా మారింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ అవినీతి పాలనతో విసిగిపోయిన కర్ణాటక ప్రజలు.. కాంగ్రెస్‌కు సంపూర్ణ అధికారమిచ్చారు. ఆ పార్టీ కూడా ఎన్నికల్లో ఎన్నెన్నో హామీలిచ్చి ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించింది. తీరా అధికారంలోకి వచ్చాక అసలు కథ మొదలైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
డీకే కొంతమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లి సిద్ధరామయ్యపై ఏకంగా పార్టీ అధిష్ఠానానికే ఫిర్యాదుచేశారు. నేనేమీ తక్కువ తినలేదన్నట్టుగా సిద్ధరామయ్య కూడా డీకే వర్గాన్ని బలహీనపర్చేందుకు తన శక్తినంతా వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర క్యాబినెట్ కూడా రెండుగా చీలిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంతర్గత కుమ్ములాటల్లోపడి ప్రభుత్వం తమను పట్టించుకోవటమే మానేసిందని ప్రజలు వాపోతున్నారు. నిజానికి కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఇలా వర్గపోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి.
ఎన్నికల హామీలు బుట్టదాఖలు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఐదు గ్యారంటీ పథకాలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలుచేయలేదు. కొన్నింటిని ఇంకా ప్రారంభించనేలేదు. వందరోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అప్పుడే చార్జిషీట్ విడుదల చేసింది. గృహ జ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, రూ.1,500 ఇచ్చే యువనిధి పథకాలను ఇంకా మొదలు పెట్టలేదు. మహిళలకు నెలకు రూ.2 వేలు ఇచ్చే గృహలక్ష్మి పథకాన్ని ఆట్టహాసంగా మొదలుపెట్టినా అది కూడా పూర్తిస్తాయిలో అమలుకావటం లేదు.
మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం అమలు జరుగుతున్నా దాంట్లో కూడా సవాలక్ష నిబంధనలు పెట్టింది. అధికార, ప్రతిపక్షాలు ఫిరాయింపుల కుట్రల్లో తలమునకలుగా ఉండటంతో మూడున్నర నెలలు గడువకముందే రాష్ట్రంలో పాలన పడకేసింది. ఇంత జరుగుతున్నా కర్ణాటకలో తాము అమలుచేస్తున్నది అద్భుత ఫార్ములా అని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్.. దానినే తెలంగాణలో అమలుచేస్తామని బడాయి పోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యుత్తు కోతలతో ప్రజలు బేజారెత్తిపోతున్నారు. ఒకవైపు విద్యుత్తు కోతలు, మరోవైపు పెరిగిన విద్యుత్తు చార్జీలతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అధికారికంగానే పవర్ హాలిడేస్ ప్రకటించింది. విద్యుత్తు సమస్యతో పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయని మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కాటిల్ విమర్శించారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఆరోపిస్తున్నది.
అంతకుమించి అవినీతి
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి అంతులేకుండా పోయింది. ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టులో మంత్రులు, ఎమ్మెల్యేలకు 40 శాతం కమీషన్ ఇవ్వందే ఏ ఫైలూ కదలటం లేదని ఆ రాష్ట్ర సివిల్ కాంట్రాక్టర్ల సంఘం బాహాటంగానే విమర్శలు గుప్పించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రకటనలు చేస్తున్న ఈశ్వరప్ప అవినీతి ఆరోపణలతోనే నాడు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీళ్ల అవినీతి పీడనకు తట్టుకోలేక పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు.
అవినీతి బీజేపీ ప్రభుత్వం పోయిందని సంతోషపడేలోపే అంతకు మించి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శలు చెలరేగుతున్నాయి. నాడు ’40 పర్సెంట్’ అవినీతి ప్రకంపనలు సృష్టించగా, నేడు ఏకంగా ‘50’ పర్సెంట్ అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్‌పైనే ‘50’ పర్సెంట్ ఆరోపణలు రావటం రాష్ట్రంలో పాలనాతీరుకు అద్దం పడుతున్నది. మరో మంత్రి సుధాకర్ ఓ దళితుడి భూమిని కబ్జా చేశారన్నది తాజా ఆరోపణ. ఇలా రోజుకో మంత్రి అవినీతి బాగోతం బయటకు వస్తూనే ఉన్నది.
ప్రభుత్వాన్ని పడగొడుతాం: బీజేపీ
సార్వత్రిక ఎన్నికల్లోగానే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతామని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈశ్వరప్ప ఇటీవల బాహాటంగానే హెచ్చరించారు. ఈశరప్ప హెచ్చరికను పెద్దగా పట్టించుకోకపోయినా తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 45 మంది టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ప్రకటించటంతో రాష్ట్రంలో పాత కథ మళ్లీ మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్, గతంలో బీజేపీలో చేరి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న తమ పార్టీ నేతలకు ఘర్ వాపసీ పేరుతో గాలం వేస్తున్నది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో బేరసారాలు నెరపుతున్నారని సమాచారం.
గతంలో ఆపరేషన్ కమలను బీజేపీ అమలు చేస్తే, ఇప్పుడు అదేపని కాంగ్రెస్ మొదలుపెట్టిందని చెప్తున్నారు. నటుడు సుదీప్ పుట్టినరోజు వేడుకకు ఇటీవల హాజరైన డిప్యూటీ సీఎం డీకే శివకకుమార్, పలువురు బీజేపీ కీలక నేతలను ఆకర్షించేందుకు యత్నించారన్న వార్తలు వచ్చాయి. శుక్రవారం డీకే శివకుమార్ సమక్షంలో పదుల సంఖ్యలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. మొత్తంగా కర్ణాటక కుక్కలు చింపిన విస్తరిలా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
నిత్యం రాజకీయ కుమ్ములాటల్లో ప్రభుత్వం మునిగి తేలుతుండటంతో ప్రజలను పట్టించుకొనేవారే కరువయ్యారు. దీంతో కన్నడిగులకు ఇప్పుడు తాగునీరు లేదు.. కరెంటు లేదు. ఐటీ రాజధానిగా చెప్పుకొనే రాష్ట్ర రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేవారు లేరు. అయినా, ఇలాంటి మాడల్‌ను తెలంగాణలో అమలుచేస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. ప్రభుత్వాలను పడగొట్టడమే డబుల్ ఇంజిన్ అన్నట్టుగా వ్యహరించే బీజేపీ కూడా తెలంగాణలో డబుల్ ఇంజిన్ పాలన అంటున్నది.