Revanth Reddy | హైదరాబాద్, మే29 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ విషయంలో తన మాట చెల్లుబాటు కాదని సీఎం రేవంత్ రెడ్డికి అర్థమై, అధిష్ఠానానికి సరెండర్ అయినట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ తాను చెప్పినవారికే పదవులు ఇవ్వాలని పట్టుబట్టిన రేవంత్, ఇప్పుడు అధిష్ఠానం నిర్ణయం తనకు శిరోధార్యం అంటూ ‘రాజీ’ అస్త్రం సంధించినట్టు చెప్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మాత్రం కచ్చితంగా పదవి ఇవ్వాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌తో ఢిల్లీకి రాయబారం పంపినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఢిల్లీ పెద్ద నుంచి సానుకూల స్పందన వచ్చిందని, మంత్రి వర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చినట్టేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మూడు రోజులపాటు ఢిల్లీలో ఉన్నా, మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం నుంచి అనుమతి రాని సంగతి తెలిసిందే. పైగా రేవంత్ ఎంత ప్రయత్నించినా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు రెండుసార్లు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడంపైనా తీవ్ర చర్చ జరిగింది. సీఎం రూపొందించిన జాబితాను రాహుల్ గాంధీ పక్కనబెట్టారని, తాను తయారు చేసిన నలుగురి పేర్లతో కూడిన జాబితాను మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఇచ్చి పంపారని కథనాలు వెలువడ్డాయి.
ఢిల్లీలో జరిగిన పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డికి తత్వం బోధపడిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తన నిర్ణయాల పట్ల అధిష్ఠానం పూర్తి వ్యతిరేకతతో ఉందని సీఎంకు అర్థమైందని నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతున్నది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 9నెలల తర్వాత రేవంత్ రెడ్డి స్వయంగా తెప్పించుకున్న అంతర్గత నివేదిక ప్రకారం 64మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 26మంది మాత్రమే ఆయనకు మద్దతుగా ఉన్నట్టు తేలిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈ సంఖ్య ఇప్పుడు 19కి పడిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇలా ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో తన పరపతి దెబ్బతింటున్నదని సీఎంకు అర్థమైందని అంటున్నారు. ఏటికి ఎదురీదటం కన్నా అధిష్ఠానంతో సఖ్యత పెంచుకోవటమే ఉత్తమమనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అందుకే బుధవారం రాత్రి అకస్మాత్తుగా మంత్రులతోపాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలకు విందు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్‌తో కలిసి సీఎం ప్రత్యేకంగా భోజనం చేశారని, అనంతరం తన రాజీ ప్రతిపాదనను ఆమె ముందు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారని, అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసినట్టు సమాచారం. పైగా సుదర్శన్‌రెడ్డికి రాజకీయంగా ఇదే చివరి అవకాశం అని, ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదని వివరించినట్టు తెలిసింది.
ఓసీ కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చి, మిగతా పదవులను అధిష్ఠానం ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి ప్రతిపాదనను మీనాక్షి గురువారం ఉదయం రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లారని, ఆయన సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో 15 నెలలుగా ఊరిస్తున్న మంత్రి వర్గ విస్తరణ హైడ్రామాకు తెరపడబోతున్నదని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అధిష్ఠానం ఇచ్చిన జాబితా ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిల్లో ఒకరికి పదవి ఇవ్వాలని ప్రతిపాదించారని, వెలమ సామాజికవర్గం నుంచి ప్రేమ్ సాగర్‌రావు కూడా పోటీలో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణలో ఓసీల నుంచి ఒక్కరికి మాత్రమే అధిష్ఠానం నిబంధన విధించిందని చెప్తున్నారు.
ఒకవేళ రెండో సీటు ఇవ్వాల్సి వస్తే ఓసీల్లోని ముస్లింలకు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. ఓసీ కోటా సీటు కోసం నలుగురు పోటీలో ఉన్న నేపథ్యంలో తన సన్నిహితుడికి ఎలాగైనా పదవి ఇప్పించాలని సీఎం గట్టిగా నిర్ణయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానానికి ‘రాజీ’ అస్త్రం ప్రయోగించారని చర్చించుకుంటున్నారు. తద్వారా మిగతా ముగ్గురు ఓసీ సామాజిక వర్గం నేతల భవిష్యత్తు దాదాపు సందిగ్ధంలో పడ్డట్టేనని ప్రచారం జరుగుతున్నది.