హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి బరాజ్‌కు మొగ్గు చూపుతున్నది. మేడిగడ్డ బరాజ్‌ను మరమ్మతులు చేసి వాడుకోవాల్సింది పోయి ఇచ్చంపల్లి బరాజ్ నిర్మా ణం చేపడితే తెలంగాణకు శాశ్వతంగా తీరని నష్టం వాటిల్లుతుందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నా రు. గోదావరి జలాలపై తెలంగాణ హ క్కులకు తీరని విఘాతం ఏర్పడుతుందన్నారు. ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం తుంగ లో తొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
గోదావరి-కావేరి అనుసంధానం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని కేంద్రం భావిస్తున్నది. ఇందులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి, అక్కడి నుంచి జలాలను కావేరి బేసిన్‌కు తరలించాలని సన్నాహాలు చేస్తున్నది. ఇచ్చంపల్లి వద్ద 95 మీటర్ల ఎత్తుతో బరాజ్‌ను నిర్మిస్తే నీటినిల్వ సామర్థ్యం 59.33 టీఎంసీలు ఉండగా, లైవ్ స్టోరేజీ 20టీఎంసీలకే పరిమితం అవుతుందని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు చెప్తున్నారు.
ఈ నిర్మాణంతో దాదాపు 23 వేల ఎకరాలు ముంపునకు గురవుతుందని, మంథని నియోజకవర్గం పరిధిలోని 9 గ్రామా లు మునిగిపోతాయని, 21,575 మంది నిర్వాసితులు అవుతారని లెక్కగట్టారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇక నీటి తరలింపు కోసం తెలంగాణ అదనంగా వేలాది ఎకరాలను కోల్పోవాల్సి ఉంటుంది. ఇచ్చంపల్లి బరాజ్ నుంచి మొదట నీటిని నాగార్జునసాగర్‌కు మళ్లించాల్సి ఉంటుంది.
ఇందుకోసం ఇచ్చంపల్లి నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ మీదుగా నాగార్జునసాగర్ వరకు 315.81 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాల్సి ఉంటుంది. దీని నిర్మాణానికి 18,661ఎకరాలను సేకరించాల్సి వస్తుందని అంచనా. ఇవన్నీ దేవాదుల, ఎస్సారెస్పీ, సాగర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన ఆయకట్టు భూములే. ఈ రకంగానూ తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోనున్నది. మధ్యలో 2 రిజర్వాయర్లను ప్రతిపాదిస్తున్నారు. వీటికోసం మరో 20వేల ఎకరాల వరకు సేకరించాల్సి ఉంటుంది.
గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్దేశిత నీటి లక్ష్యాలు నెరవేరాలన్నా, ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అవసరాలు తీరాలన్నా ఇచ్చంపల్లి వద్ద కనీసం 30 నుంచి 40 టీఎంసీల వరకు లైవ్ స్టోరేజీ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు బరాజ్‌ను నిర్మిస్తే ఇప్పుడున్న అంచనాలకు మూడింతలకుపైగా భూమి ముంపునకు గురవుతుందని.. ముంపు గ్రామాల సంఖ్య, నిర్వాసితుల సంఖ్య కూడా పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు 112 మీటర్ల ఎత్తుతో బరాజ్‌ను నిర్మిస్తే 91 వేల ఎకరాల పట్టా భూములు, 23వేల ఎకరాల అటవీభూమి, 65 గ్రామాలు ఆగమవుతాయన్నారు.
118 మీటర్లతో నిర్మిస్తే 1.51లక్షల ఎకరాల పట్టాభూములు, 72వేల ఎకరాల అటవీ భూమి, 74గ్రామాలు ముంపునకు గురవుతాయని హెచ్చరిస్తున్నారు. 115మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఇచ్చంపల్లి వద్ద బరాజ్‌ను నిర్మిస్తే తెలంగాణలో 53,352 ఎకరాలు మునగడంతోపాటు దక్షిణకాశీగా పేరొందిన కాళేశ్వరం దేవాలయం మెట్ల వరకు ముంపు వస్తుంది. సిరోంచ పట్టణం చుట్టూ నీరు నిలిచి ఉంటుంది. నిజాం జమానా లో గుట్టపై కట్టిన గెస్ట్‌హౌస్ తప్ప ఏదీ మిగలదు. మహదేవపూర్, మంథని పట్టణాల దగ్గరికి నీరు చేరనుంది. చెన్నూర్‌కు ముంపు తప్పదు. 51 గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదమున్నది. గోదావరిఖని సింగరేణికి సైతం ముంపు తప్పదని తెలంగాణ ఇంజినీర్లు తేల్చిచెప్తున్నారు.
గోదావరి-కావేరి రివర్ లింక్ ప్రాజెక్టుతో ఇటు ముంపు విషయంలోనూ, అటు జలాల వినియోగంలోనూ తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లనున్నది. అయినా ఈ ప్రాజెక్టు ద్వారా ఒనగూరే ప్రయోజనాలు నామమాత్రమే. నికరంగా తెలంగాణకు 45, ఏపీకి 44, తమిళనాడుకు 38, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 16 టీఎంసీలను అందించాలని కేంద్రం ప్రతిపాదించింది. అంటే తెలంగాణ వాటా కేవలం 27 శా తం. కృష్ణా నుంచి తెలంగాణకు వచ్చే ప్రవాహాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
మేడిగడ్డకు బదులు ఇచ్చంపల్లి ఎత్తుపెంచి అక్కడి నుంచే గోదావరి జలాలను తెలంగాణ వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఎన్‌డబ్ల్యూడీఏ కొత్త వాదన ఎత్తుకున్నది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వంతపాడుతున్నది. వినడానికి ఇది బాగానే ఉన్నా, ఆచరణలో మాత్రం కష్టసాధ్యమని ఇంజినీర్లు చెప్తున్నారు. గోదావరికి వరద వచ్చినప్పుడు, తెలంగాణకు జల అవసరాల సమయంలో నీటిని ఎత్తిపోసుకోవడం మేడిగడ్డ బరాజ్ ప్రధాన ఉద్దేశం. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఏ ఆయకట్టుకు ఎక్కడ నీళ్లు తక్కువ పడినా అప్పుడు మోటర్లు ఆన్ చేసి ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంటుం ది. కానీ ఇచ్చంపల్లి బరాజ్ రివర్ లింక్ ప్రాజెక్టు కాబట్టి జాతీయ ప్రాజెక్టుగానే ఉంటుందని, ని ర్వహణ మొత్తం కూడా కేంద్రం చేతుల్లోనే కొనసాగుతుందన్నారు. అలాంటప్పుడు మన ఆయకట్టు అవసరాలకు ఎప్పుడంటే అప్పుడు ఎత్తిపోసుకునేందుకు వీలుండదని అంటున్నారు.
ఇచ్చంపల్లి దిగువన దుమ్ముగూడెం వరకు గోదావరి జలాలను సైతం తెలంగాణ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇచ్చంపల్లి దిగువన దేవాదుల కోసం 38 టీఎంసీలు, సమ్మక్కసాగర్ బరాజ్ నుంచి 47టీఎంసీలు, ప్రస్తుతం నిర్మిస్తున్న సీతమ్మసాగర్ నుంచి 67టీఎంసీలు, మోడికుంట 1.5 టీఎంసీలు ఇలా మొత్తంగా 153.5 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ వినియోగించుకోవాల్సి ఉం టుంది. ఈ ప్రాజెక్టులకు ఎగువన ఉన్న ఇచ్చంపల్లి నుంచే నీరు విడుదల కావాల్సి ఉంటుంది. జీసీ లింక్ ప్రాజెక్టు కేంద్రం పరిధిలో ఉంటుంది. కాబట్టి కేంద్ర అనుమతిస్తేనే ఇచ్చంపల్లి నుంచి దిగువకు జలాలు వస్తాయి. ప్రతి చుక్కకూ కేం ద్రం ఎదుట తెలంగాణ మోకరిల్లాల్సిన దుస్థితి నెలకొంటుందని స్పష్టంగాతెలియజేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చంపల్లి ప్రతిపాదనలను మానుకొని, మేడిగడ్డను రిపేర్ చేయించాలని కోరుతున్నారు.