హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరి వారం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం వారిని డమ్మీలుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతి గ్రామంలో ‘ఇందిరమ్మ స్థాయీ సంఘాల’ పేరుతో కమిటీలను ఏర్పాటు చేసేందుకు వ్యూహం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో స్థాయీ సంఘాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వాటిని తొలగించి సర్పంచ్‌లకే ప్రాధాన్యమిచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ వాటిని తెరమీదికి తెస్తున్నది. ఈ నెల 17న చివరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాల తీరుతెన్నుపై మంత్రులు, ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అధికారం, ఆర్థిక బలం, పోలీసు బలగాలను ప్రయోగించినా ఫలితాలు ఆశాజనకంగా రాకపోవడంపై కలవరపాటుకు గురయ్యారు.
కార్యకర్తలను విస్మరించడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మంత్రులు, ఎమ్మెల్యేలతో పేర్కొన్న సీఎం కార్యకర్తల ఆర్థిక పరిపుష్టి కోసం గ్రామాల్లోకి మళ్లీ స్థాయీ సంఘాలను తీసుకురావాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. శానిటేషన్ సంఘం, స్ట్రీట్ లైట్స్ సంఘం, పచ్చదనం సంఘం, అభివృద్ధి పనుల సంఘం ఇలా నాలుగు స్థాయీ సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం.
పంచాయతీ స్థాయీ సంఘాలు ఉమ్మడి ఏపీలో అమల్లో ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏడాదిన్నరపాటూ వాటి మనుగడ ఉన్నది. అయితే సంఘాల్లోని సభ్యులు సర్పంచ్ అధికారాలు, నిత్య కార్యక్రమాల్లో జోక్యం బాగా పెరిగింది. గ్రామ అభివృద్ధి ప్రణాళికలను వ్యతిరేకించడం, పనులు సాగకుండా అడ్డుపడటం, సర్పంచులను బ్లాక్మెయిల్ చేయడం, ప్రతి పని, స్కీమ్‌లో కమీషన్లు తీసుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఇలా ఒక్క ఏడాదిలోనే సంఘాల పనితీరుపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అదే సమయంలో ఏపీలో స్థాయీ సంఘాలకు కొత్తరూపం ఇచ్చి అమలు చేసిన జన్మభూమి కమిటీలపై ప్రజా వ్యతిరేకత రావటంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. సంఘాలను తీసేసి గ్రామాభివృద్ధిలో వాటి ఊసే లేకుండా చేసి పారదర్శక పాలనకు చర్యలు తీసుకున్నారు.
ఏపీలో చంద్రబాబు జన్మభూమి కమిటీల తరహాలో తెలంగాణలో ఇందిరమ్మ స్థాయీ సంఘాలు తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల సంపద సృష్టి కోసం చంద్రబాబు జన్మభూమి కమిటీల వ్యవస్థను అమలు చేస్తుండగా అవి ఇప్పటికే సర్పంచులను రబ్బర్ స్టాంపులుగా మార్చాయి. పల్లెకు వచ్చిన ప్రతి పనికి, పథకానికి రేటు ఫిక్స్ చేసి ప్రజలను పీల్చి పిప్పి చేశాయనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. సరిగ్గా అలాంటి కమిటీలను యథాతథంగా సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేయబోతున్నట్టు తెలుస్తున్నది.
ప్రతి గ్రామంలో నాలుగు స్థాయీ సంఘాలు ఏర్పాటు చేసి, వాటిని కాంగ్రెస్ కార్యకర్తలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 12,760 పంచాయతీల్లో దాదాపు 51 వేల స్థాయీ సంఘాలు ఏర్పాటు చేస్తారని వినికిడి. సంఘం సభ్యులు సర్పంచులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు గ్రామపంచాయతీ అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకునేలా అధికారాలు కట్టబెట్టబోతున్నట్టు చర్చ జరుగుతున్నది. గ్రామాభివృద్ధి ప్రణాళికలో స్థాయీ సంఘం సభ్యుల సిఫారసులకు ప్రాధాన్యం కల్పించి, పనులను పర్యవేక్షించే బాధ్యత కూడా వారికి అప్పగించేలా నిబంధనలు రూపొందించినట్టు సమాచారం. త్వరలోనే తుదిరూపం ఇచ్చి ఉత్తర్వులు విడుదల చేస్తారని చర్చ జరుగుతున్నది. ఇవే అమలైతే సర్పంచులు, పాలకవర్గాలు డమ్మీలుగా మారి, స్థాయీ సంఘాల జోక్యం మితిమీరబోతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.