కరీంనగర్, జూన్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి సంస్థ అధికారులకు న్యాయబద్ధంగా రావాల్సిన ఫర్ఫామెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) చెల్లింపుల్లో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర జాప్యం చేస్తున్నది. రెండేండ్లుగా చెల్లింపులు చేయకుండా అధికారులను రేవంత్ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతున్నది. సింగరేణి అధికారుల సంఘం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు వివిధ శాఖల మంత్రులను సుమారు 60సార్లు కలిసి విన్నవించినా ఏ ఒక్కరికీ పట్టింపే లేదు. దీంతో రేవంత్ సర్కార్ తీరుపై సింగరేణి అధికారులు రగిలిపోతున్నారు. పీఆర్పీ ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెడుతున్న హస్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. నిజానికి పీఆర్పీ అనేది సింగరేణి అధికారులకు ఇచ్చే భిక్ష కాదు, వారు తమ చెమట, రక్తం చిందించి సాధించిన చట్టబద్ధమైన హక్కు.
అది వారి వేతన నిర్మాణంలో ఒక భాగం. పీఆర్పీ ఒప్పందం జరిగిన ప్రారంభంలోనూ ఆనాటి కాంగ్రెస్ సర్కార్ ఏడేండ్ల పాటు పేమెంట్స్ చేయకుండా అడ్డుపుల్లలు వేసింది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏండ్లపాటు ఏటా నిబంధనలకు లోబడి సింగరేణి అధికారులకు చెల్లింపులు చేసింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా పీఆర్పీ చెల్లించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. సింగరేణి అధికారులకు చెల్లింపులు చేయకుండా ఉత్పత్తిపై ప్రభావం పడేలా చేసి.. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించాలన్న కుట్ర దాగి ఉన్నదన్న చర్చ ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా కొనసాగుతున్నది.
2007 ఒప్పందం ప్రకారం సింగరేణి అధికారులకు ఏడాదికోసారీ ఫర్పామెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) చెల్లింపులకు అటు కోల్ ఇండియాలోనూ ఇటు సింగరేణిలోనూ ఆనాటి ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. 2007 నుంచి నేటివరకు కోల్ ఇండియా పీఆర్పీని అమలు చేస్తుండగా, 2007 నుంచి 2014 వరకు సంస్థ అధికారులకు పీఆర్పీలో భాగంగా రావాల్సిన ఒక్క పైసాను కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవ్వనేలేదు. 2007లో జరిగిన ఒప్పంద వివరాలు తెలుసుకొన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్.. 2014 నుంచి తన ప్రభుత్వం దిగిపోయే వరకు ఏటేటా క్రమం తప్పకుండా పీఆర్పీని చెల్లిస్తూ వచ్చారు.
పీఆర్పీని నేరు గా వారి ఖాతాల్లోనే జమచేసేలా ఏర్పాట్లు చేశారు. 2007 నుంచి 2014 వరకు పీఆర్పీ ఇవ్వకుండా అధికారులను ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఇబ్బందులకు గురిచేయగా.. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో వెళ్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్పీ చెల్లింపులకే స్వస్తి పలికింది. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు చెందిన రూ.280 కోట్ల పీఆర్పీని ఒప్పందం ప్రకారం అధికారులకు చెల్లించాల్సి ఉన్నది. ఈ పీఆర్పీ చెల్లింపుల కోసం సింగరేణి సంస్థ ఏటా ఇచ్చే మొత్తం డబ్బును జమ చేసి ఉంచుతుంది. వీటి చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తే సరిపోతుంది.
కానీ, రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా అనుమతి ఇవ్వకపోవడంతో సింగరేణి అధికారుల సంఘం ఏడాదికాలంగా ప్రభు త్వం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సింగరేణిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 2,800 మంది అధికారులు పోరుబాట పట్టారు. ఇప్పటికే గోదావరిఖని, శ్రీరాంపూర్, కొత్తగూడెం ప్రాంతాల్లో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన అధికారుల సంఘం పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నది.
పీఆర్పీ ఒప్పంద విధానాలను సింగరేణిలో అమలు చేయకపోవడం వల్ల దాదాపు ఒక్కో అధికారి నెలకు రూ.40 వేల వేతనం నష్టపోవాల్సి వస్తున్నది. ఉత్పత్తి విషయంలో అధికారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఇటీవలే విధినిర్వహణలో ఇద్దరు అధికారులు చనిపోయారు.
-టీ లక్ష్మీపతిగౌడ్, అధ్యక్షుడు, సింగరేణి అధికారుల సంఘం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి అధికారులకు పీఆర్పీ ఇచ్చింది. అదే విధానం కొనసాగించడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులేమిటో అర్థంకావడం లేదు. న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్పీ కోసం పోరుబాట పట్టాల్సి వస్తున్నది. అనేకసార్లు మంత్రులను కలిసి విన్నవించాం. ప్రత్యక్షంగా కలిసి మాఇబ్బందులు వివరించాం.
– పెద్ది నరసింహులు, ప్రధాన కార్యదర్శి, సింగరేణి అధికారుల సంఘం