న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం బాధిత విద్యార్థులు, పోలీసుల మధ్య సోషల్ మీడియా వార్ ఆరంభమైంది. ముందుగా మీరు దాడి చేశారంటే.. కాదు మీరే చేశారంటూ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాక, తమ వాదనలకు మద్దతుగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సోమవారం సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దయెత్తున నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థులు పార్లమెంట్ వైపు దూసుకురావడానికి ప్రయత్నించి బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్న పోలీసులు బాష్ప వాయు గోళాలను ప్రయోగించడంతో పాటు లాఠీచార్జి చేశారు. విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని ఎండగడుతూ సోషల్ మీడియాలో విద్యార్థి వర్గాలు వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉంచడంతో పోలీసులపై పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. తాము విద్యార్థులపై ముందుగా లాఠీచార్జి చేయలేదని, వాళ్లే ముందుగా రాళ్లు రువ్వడం, వాహనాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.