హైదరాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): రైతులపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేసేందుకు రంగం సిద్ధమైంది. రెండేండ్లుగా రైతులు పడుతున్న యూరియా కష్టాలను తీర్చకపోగా, వారిని మరింత నష్టాలపాలు చేసేందుకే నిర్ణయం తీసుకున్నది. యూరియా ఉచిత రవాణా సబ్సిడీని రద్దు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ అంశంపై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వద్ద పలు దఫాలుగా చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ మేరకు పూర్తి నివేదికను అందించాలని అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. దీంతో ఉచిత రవాణాను రద్దు చేస్తూ ఏ క్షణమైనా ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉన్నది. ఈ నిర్ణయంతో ఇకపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్కే), డీసీఎంఎస్ కేంద్రాలకు ఉచితంగా యూరియా రవాణా (ఎఫ్వోఎల్) చేయడాన్ని రద్దు చేయనున్నారు.
ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే ఇకపై ప్రైవేటు దుకాణాల మాదిరిగానే పీఏసీఎస్, ఆగ్రోస్, డీసీఎంఎస్ కేంద్రాలు సైతం కంపెనీలకు యూరియా రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవంగా రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు (పీఏసీఎస్), మరో 900 ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, 10 డీసీఎంఎస్‌లు ఉన్నాయి. యూరియా పంపిణీలో ప్రైవేటు గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా వీటి ద్వారా ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నది. ప్రైవేటు ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లి రైతులు నష్టపోకుండా ఆయా కేంద్రాల ద్వారా ఎమ్మార్పీ ధరకే యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నది.
ఈ కేంద్రాలకు మార్క్‌ఫెడ్ నుంచి యూరియా సరఫరా అవుతున్నది. ప్రైవేటు దుకాణాదారులు మాత్రం నేరుగా కంపెనీల నుంచే కొనుగోలు చేసి విక్రయిస్తారు. ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు యూరియా విక్రయంలో ఆయా కేంద్రాలకు మాత్రం ఆర్థిక వెసులుబాటు కల్పించింది. గోదాముల నుంచి యూరియాను పీఏసీఎస్, ఆగ్రోస్, డీసీఎంఎస్‌లకు ఫ్రీ ఆన్ లారీ (ఎఫ్వోఎల్) పేరుతో ఉచితంగా సరఫరా చేస్తున్నది. ప్రైవేటు దుకాణాదారులు మాత్రం కంపెనీలకు రవాణా చార్జీలు చెల్లిస్తారు. అందుకే ప్రైవేటు దుకాణాల్లో వ్యాపారులు యూరియాను ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తుండగా, పీఏసీఎస్, ఆగ్రోస్, డీసీఎంఎస్ కేంద్రాల్లో మాత్రం కచ్చితంగా ఎమ్మార్పీకే విక్రయిస్తారు.
ఎఫ్వోఎల్ రద్దు వల్ల పీఏసీఎస్, ఆగ్రోస్, డీసీఎంఎస్ కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లనున్నది. ఎఫ్వోఎల్ కింద ఏటా పీఏసీఎస్, ఆగ్రోస్, డీసీఎంఎస్‌ల కోసం ఎరువుల కంపెనీలకు మార్క్‌ఫెడ్ సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లు చెల్లిస్తున్నట్టుగా తెలిసింది. ఈ లెక్కన ఇప్పుడు ఎఫ్వోఎల్ రద్దుతో ఆ మొత్తం సదరు సంస్థలే కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాటికి ఇప్పటివరకు గల ఆర్థిక వెసులుబాటు కోల్పోవడంతోపాటు వాటిపై ఆర్థికభారం పడే ప్రమాదం పొంచి ఉన్నది.
రైతులు యూరియా కోసం పీఏసీఎస్ కేంద్రాల వద్దకు రాకుండా చేసేందుకు ఎఫ్వోఎల్ రద్దుకు కుట్ర చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. దీం తో సదరు కేంద్రాలు సైతం అధిక ధరకు వి క్రయించే అవకాశం ఉంటుంది. లేదా నష్టాలు భరించలేక గతంలో మాదిరిగా కాకుండా యూరియా స్టాక్‌ను తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్యాక్స్ వద్ద యూరియా లేకపోతే ప్రైవేటు దుకాణాల వద్దకు రైతులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రైతులపై ధరాభారం మోపి, ప్రభుత్వ కేంద్రాలకు రా కుండా.. ప్రైవేటు కేంద్రాలకు పురమాయించే చర్యలకు సర్కారు దిగుతున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒక్క దెబ్బతో రెండు పిట్టల మాదిరిగా ఒక్క ఎఫ్వోఎల్ రద్దు నిర్ణయంతో ఇటు కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా మారిన పీఏసీఎస్‌ను, ఇటు రైతుల యూరియా గొడవలకు చెక్ పెట్టాలని సర్కారు భావిస్తున్నట్టుగా తెలిసింది. ఎఫ్వోఎల్ రద్దు చేయడమంటే ప్యాక్స్‌కు మరణశాసనం రాయడమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మెజారిటీ పీఏసీఎస్ యూరియా విక్రయం, ఎఫ్వోఎల్ ద్వారా వచ్చిన లాభాలతోనే నెట్టుకొస్తూ రైతులకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడు ఎఫ్వోఎ ల్ రద్దు చేస్తే వాటి ఆర్థిక మూలాలకు గండి కొట్టినట్టవుతుంది. దీంతో లాభంలేని, నష్టాలు తెచ్చే యూరియా విక్రయాల నుంచి పీఏసీఎస్ కేంద్రాలతోపాటు ఆగ్రోస్ కేంద్రాలు, డీసీఎంఎస్‌లు తప్పుకొనే అవకాశం ఉన్నది. ప్రైవేటు వ్యాపారులంటే యూరియాతో పాటు ఇతర వస్తువులను రైతులకు కట్టబెట్టి లాభాలు గడిస్తారు. కానీ సొసైటీల్లో ఆ పరిస్థితి ఉండదు. ఈ స్థితిలో లాభంలేని వ్యాపారాన్ని చేయాల్సిన అవసరం ఏమిటని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
నిబంధనల ప్రకారం ప్రైవేటు దుకాణాలు యూరియాను ఎమ్మార్పీకే విక్రయించాలి. అంటే ఒక బ్యాగును రూ.266కే విక్రయించాలి. అంతకన్నా నయా పైసా ఎక్కువ తీసుకోద్దు. కానీ ప్రైవేటు వ్యాపారులు ఒక్కో బ్యాగుపై కనీసం రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తారనేది బహిరంగ రహస్యమే. అయితే పీఏసీఎస్, ఏఆర్ఎస్కేలు, డీసీఎంఎస్‌లలో మాత్రం ఎమ్మార్పీ ధరకే విక్రయిస్తారు. ఆయా కేంద్రాలకు ఎఫ్వోఎల్ ఉండటం, ప్రైవేటు వ్యాపారులకు లేకపోవడమే దీనికి కారణం. ఎఫ్వోఎల్ ద్వారా వచ్చే మొత్తం సొసైటీలకు ఇతర నిర్వహణ ఖర్చులకు మిగులుతుండగా, ప్రైవేటు వ్యాపారులు ఎమ్మార్పీకి అదనం గా వసూలు చేసే మొత్తం లాభంగా భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సూర్యాపేటలో ఎమ్మార్పీకి యూరియాను విక్రయించబోమని ప్రైవేటు వ్యాపారులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ తెగేసి చెప్పారు. ఇప్పుడు ఆ సొసైటీలకు ఇచ్చే ఎఫ్వోఎల్ రద్దు చేస్తే సదరు సంస్థలు సైతం అధిక ధరకు యూరియాను విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే రైతులపై ధరల భారం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ పరిధి శివునిపల్లిలోని కృష్ణా ఫర్టిలైజర్ వద్ద యూరియా కోసం రైతులు సుమారు పది గంటలు పడిగాపులు కాశారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రైతులు వేచి ఉండగా, షాపు యజమాని మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చాడు. సాయంత్రం ఆరు గంటల వరకు కూడా రైతులకు యూరియా దొరక్కపోవడంతో ప్రభుత్వంపై అసహనం వ్యక్తంచేశారు.
-స్టేషన్‌ఘన్‌పూర్
రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి గురువారం 440 బస్తాలు వచ్చాయని తెలియడంతో రైతులు వేకువజామునే వచ్చి క్యూలో నిలబడ్డారు. సుమారు 800 మంది రైతులు వస్తే 440 బస్తాలు మాత్రమే రావడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం రైతులు యూరియా కార్డులు కలిగి ఉన్నప్పటికి కార్డులో పొందుపర్చిన పంటసాగు వివరాల ఆధారంగా ప్రస్తుతం మక్కజొన్న పంటను సాగు చేస్తున్న రైతులకు మాత్రమే యూరియా బస్తాలను దశాల వారీగా అందిస్తున్నారు. యూరియా బస్తాల కోసం నరకయాతన పడాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-నెల్లికుదురు