హనుమకొండ, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అంటే గుబులు పట్టుకొన్నది. బీఆర్ఎస్ సభలంటేనే ఉలిక్కి పడుతున్నది. ప్రజల దృష్టిని మరల్చేందుకు నానా అవస్థలు పడుతున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనపై అన్నివర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రోడ్ల మీదికొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో ఇబ్బందులు పడుతున్న వర్గాలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభలకు, చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నది.
ఈ క్రమంలో ఈ నెల 6న పదివేల మందితో వరంగల్‌లో రైతు సదస్సు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం 2022 మే 6న వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు డిక్లరేషన్’ను ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా డిక్లరేషన్‌లోని హామీలను నెరవేర్చకపోవడంపై బీఆర్ఎస్ స్పందించింది. రైతు డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని వరంగల్ నుంచే ఎండగట్టాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండున్నరేండ్లుగా రైతులకు చేస్తున్న మోసాలు మరోసారి బయటపడుతాయనే ఉద్దేశంతో చిల్లర రాజకీయాలకు తెరలేపింది.
బీఆర్ఎస్ సభల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదని నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏప్రిల్ 20న జగిత్యాలలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. వారంరోజుల ముందుగానే జగిత్యాల బహిరంగసభ నిర్ణయం జరగ్గా, రాష్ట్ర ప్రజలంతా ఆ సభపై ఆసక్తి ప్రదర్శించారని చెప్తున్నారు. దీంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు బీఆర్ఎస్ సభ రోజే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పోటీ సభ నిర్వహించారు. కేవలం మూడురోజుల ముందే హడావుడిగా ఈ కార్యక్రమాలను ఖరారు చేశారని అధికారులు తెలిపారు. అయినా జగిత్యాలలో బీఆర్ఎస్ బహిరంగసభ ఘన విజయం సాధించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అక్కసుతో కేసీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేశారని అంటున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు వరంగల్‌లో బీఆర్ఎస్ రైతు సదస్సుకు పోటీగా రైతు మేళా నిర్వహిస్తున్నారని అంటున్నారు.
రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సు కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వరంగల్ నగరం హంటర్‌రోడ్డులోని సీఎస్ఆర్ ఫంక్షన్‌హాలు సమీపంలో 10 వేల మందితో ఈ రైతు సదస్సు జరుగనున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి పల్లె నుంచి రైతు ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యేలా బీఆర్ఎస్ బాధ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వడ్లు, మక్క కొనుగోలులో ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను రైతులకు వివరించేలా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమం కోసం అమలుచేసిన పథకాలను వివరిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును పోల్చి చూడాలని రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు.
బీఆర్ఎస్ రైతు సదస్సుకు పోటీగా ప్రభుత్వ ఖర్చుతో ఈ నెల 5, 6, 7 తేదీల్లో వరంగల్‌లో కాంగ్రెస్ సర్కార్ ‘రైతు మేళా’ నిర్వహిస్తున్నది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెల 4 నుంచి వారంరోజులు రైతు వారోత్సవాలు నిర్ణయిస్తున్నామని, దీంట్లో భాగంగా వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో రైతు మేళా నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ ప్రకటించింది. వాస్తవానికి ముందుగా ఈ కార్యక్రమాన్ని అనుకోలేదని, బీఆర్ఎస్ సదస్సుకు ఏర్పాట్లు మొదలుకాగానే ప్రభుత్వం హడావుడిగా రైతుమేళాను ఖరారు చేసిందని అధికారులే చెప్తున్నారు. రైతుమేళా జరిగే మూడురోజులపాటు సుమారు 5,000 మంది చొప్పున రైతులను తరలించాలని అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.