హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అమలవుతుందో, లేదో తెల్వని బీసీ బిల్లును అడ్డుగా పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల నడుమ కొత్త చిచ్చురేపింది. ఇంటింటి సర్వే, విద్యా, ఉపాధి, ఉద్యోగ, రాజకీయరంగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన బిల్లుపైనే ఆ చిచ్చు రాజుకుంటున్నది. ఆయా అంశాల్లో సర్కారు తీరును తప్పుబడుతూ, లోపాలను సవరించాలని బీసీ మేధావివర్గం ఒకవైపు డిమాండ్ చేస్తుండగా, ఇంకా చట్టం ఆచరణలోకి రాకముందే కొన్ని కులసంఘాలు మాత్రం సర్కారుకు వత్తాసు పలుకుతూ జేజేలు కొడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మెదులుతూ ప్రాపకం కోసం ఏకంగా విజయోత్సవాలు నిర్వహించేందుకు పూనుకోవడమే కాదు, ఢిల్లీ బాట కూడా పట్టాయి. మొత్తంగా ఇప్పుడిదే విషయమై బీసీ మేధావివర్గాలు, కులసంఘాలు, సామాజికవేత్తలు సైతం రెండుగా చీలిన పరిస్థితి కనిపిస్తున్నది.
ప్రభుత్వం పంచనచేరి ఉనికి కోసం కొందరు పాకులాడుతుంటే, చట్టాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ, వాటిని సవరించాలని, లేదంటే మొదటికే మోసం వస్తుందని మేధావివర్గం ఆందోళన చెందుతున్నది. ఇదే అదునుగా కాంగ్రెస్ సర్కారు అనుకూల కులసంఘాలను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్నది. ఇప్పుడిదే విషయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన నాటి నుంచీ కొన్ని బీసీ, కుల సంఘాలు ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాయి. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ అడుగడుగునా బీసీ నాయకత్వాన్ని పట్టించుకోకవడం, కులగణన మినహా ఇతర డిక్లరేషన్ హామీల ఊసే ఎత్తలేదు. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు మొదలు, ఇటీవల నామినేటెడ్ పదవుల భర్తీ వరకూ కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉన్నదని వివిధ బీసీ సంఘాలు బాహాటంగా నిప్పులు చెరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వేలో ప్రామాణికత లేకుండా చేసిందని వివిధ కులసంఘాలు, మేధావివర్గాలు తొలి నుంచి అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. తాజాగా 2 బీసీ బిల్లుల రూపకల్పనలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అదేతరహా లోపభూయిష్టమైన విధానాలను అమలు చేసిందని ఆగ్రహంతో ఉన్నా రు. నిబంధనలకు విరుద్ధంగా బీసీ కమిషన్ నివేదిక లేకుండా, డెడికేటెడ్ కమిషన్ నివేదికనే రెఫరెన్స్‌గా పెట్టి విద్యా, ఉద్యోగ రంగాల రిజర్వేషన్లను పెంచిందని, ఆది నుంచీ అడ్డదిడ్డంగా జీవోలను జారీ చేసిందని, తిరిగి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తక తప్పని పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సర్వేలో అడుగడుగునా వెల్లడైన లోపాలను సవరించకుండానే, అసంబద్ధమైన గణాంకాలతో చట్టాలను చేసినా, ఇప్పటికీ కులాల వారీగా లెక్కలను బయటపెట్టకపోయినా కూడా కొన్ని కులసంఘాల ప్రతినిధులు, బీసీ మేధావులు మాత్రం నోరుమెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. లోపాలను ఎత్తిచూపి, సర్వే సక్రమంగా జరిగేలా చూడకుండా, ప్రభుత్వం పంచనచేరి ఉనికికోసమే వారు పాకులాడుతున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులు, సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇంటింటి సర్వే, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశంలో అనేక లోపాలున్నా కొన్ని కులసంఘాలు, మరికొందరు మేధావులు సర్కార్‌కు ఏకపక్షంగా మద్దతునిస్తూ వస్తున్నాయని బీసీల్లోని మరో మేధావివర్గం, పలు కులసంఘాలు మండిపడుతున్నాయి. సర్వే ప్రారంభంక కాకముందే కొన్ని సంఘాల నేతలైతే ఏకంగా ప్రభుత్వ పెద్దలను కలిసి సన్మానాలు కూడా చేశాయని, అదేమని నిలదీస్తే సర్వేను ప్రభుత్వం చేపట్టడమే మహా గొప్ప అనే తరహాలో అవి క్షేత్రస్థాయిలో ప్రచారం చేశాయని గుర్తుచేస్తున్నారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే న్యాయపరంగానైనా కొట్లాడుదామని పిలుపునిచ్చినా, ఆయా సంఘాల నేతలు, కులసంఘాల ప్రతినిధులు ఉలుకు పలుకు లేకుండా పోయాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కులాలవారీ లెక్కలను బయటపెట్టకుండానే చట్టాలను చేసినా సర్కారును నిలదీయకుండా, లోపాలను ఎత్తిచూపకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. కేవలం ఉనికి కోసం, ప్రభుత్వ పెద్దల మెప్పుకోసమే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని బీసీ హక్కులను తాకట్టు పెడుతున్నాయని ధ్వజమెత్తుతున్నారు.
రెండువర్గాలుగా చీలిపోయిన కులసంఘాలు, బీసీ మేధావివర్గం తీరుపై సామాజికవేత్తలు తీవ్ర అసహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ప్రభుత్వ తీరునూ తప్పుబడుతున్నారు. ప్రజా ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నావళిని తయారుచేసి ప్రజాకులగణన నిర్వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎంతగా చెప్పినా రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపిస్తున్నారు. సర్వేను నామమాత్రంగా నిర్వహించి, ఆ అసంబద్ధ గణాంకాలతో చట్టాలను చేసి మళ్లీ న్యాయపరమైన వివాదాల్లోకి నెట్టాలనే కుట్రలనే అమలు చేస్తున్నదని సామాజిక వేత్తలు నొక్కి చెప్తున్నారు. ఐక్యతను ప్రదర్శించి, ప్రభుత్వం కుట్రలను బట్టబయలు చేయాల్సిన కులసంఘాలు, బీసీ మేధావులు రెండుగా చీలిపోవడంపై సామాజికవేత్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బీసీ మేధావులు, కులసంఘాలు ఏకతాటిపై రాకుండా కాంగ్రెస్ సర్కారు సైతం ఆది నుంచీ ఆచితూచి వ్యవమరిస్తున్నది. అనుకూలమైన మేధావి వర్గాన్ని, కులసంఘాల నేతలను ముందుపెట్టి ఆది నుంచీ ఇంటింటి సర్వే, చట్టాల రూపకల్పన మంత్రాంగాన్ని నడిపిస్తూ వస్తున్నది. అనుకూల బీసీ వర్గాలతో భేటీలు అవుతూ ప్రోత్సహిస్తున్నది. బీసీ రిజర్వేషన్ల అంశంపై చట్టాలను చేసిన అనంతరం ప్రభు త్వం కనుసన్నల్లోనే కొన్ని కులసంఘాల నేత లు ఉత్సవాలు చేసినట్టు చర్చ జరుగుతున్నది. చట్టాలు ఆచరణలోకి తీసుకురాకముందే హడావుడి చేస్తూ, సర్కారుకు జేజేలు కొట్టడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమై న ఓ బీసీ సంఘం నేతకు నామినేటెడ్ పదవిని ఆశచూపి సర్కారు తనకు అనుకూల కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నది. త్వరలోనే ఢిల్లీలో ధర్నా కోసం ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్న సర్కారు, ప్రత్యేక రైళ్లను బుక్ చేసి అందుకోసం వివిధ బీసీ నేతలను పంపేందుకు సన్నాహాలు చేసిందని సమాచారం.