హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త సర్పంచ్ల ఆకలి కేకలను కూడా పట్టించుకోవడం లేదు. ఊరూరా తిరుగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు, గ్రామాల్లో ప్రథమ పౌరులకు ఇచ్చే అరకొర గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వలేకపోతున్నది. మాజీ సర్పంచ్లు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పరిస్థితి గాలిలో దీపంలా మారగా, కొత్త వారికి మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా 12,702 గ్రామాల్లో గతేడాది డిసెంబర్ 22వ తేదీనే కొత్త పాలకవర్గాలు కొలువుదీరినా, ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన కనీస గౌరవం దకడం లేదు. నెలకు కేవలం రూ.6,500 గౌరవ వేతనం కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో రాష్ట్ర ఖజానా ఉన్నదా? అని సర్పంచ్లు నిలదీస్తున్నారు. మూడు నెలలకుగాను ఒక్కొక్కరికీ రూ.19,500 చొప్పున మొత్తం రూ. 24,76,89,000 ప్రభుత్వం బకాయి పడింది. ప్రజాపాలన అంటే ఇదేనా? అని సర్పంచ్లు విమర్శిస్తున్నారు.