హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : బతుకమ్మ చీరల పథకాన్ని ఇందిరమ్మ చీరలుగా మార్చింది సర్కారు. ఏటా సద్దుల పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పంపిణీ చేయాల్సిన చీరలను ఇందిరమ్మ జ యంతి రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది. మంగళవారం సచివాలయంలో మంత్రి సీతకతో కలిసి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. తొలిదశలో గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయాలని, డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు చీరల అందించే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
పట్టణా ల్లో మార్చి 1నుంచి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పంపిణీ పూర్తి చేయాలన్నారు. బుధవారం నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ మహిళలతో ముఖాముఖి మాట్లాడుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీసీలో పాల్గొనాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో మంత్రి సీతక, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ హ్యాండ్లూమ్స్ శైలజా రామయ్యర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, సెర్ప్ సీఈవో డీ దివ్య పాల్గొన్నారు.