Telangana | హైదరాబాద్, డిసెంబర్26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 75 శాతం పనులు పూర్తి అయిన ప్రాజెక్టులకు కూడా దిక్కు లేకుండా పోయింది. సంబంధిత శాఖ మంత్రి మాత్రం సమీక్షల మీద సమీక్షలు పెడుతూ, జిల్లాల పర్యటనలు చేస్తూ, ప్రాజెక్టులను సందర్శిస్తూ పనులను పూర్తిచేస్తున్నాం అంటూ హడావుడి చేస్తున్నా ఆచరణలో మాత్రం అడుగుకూడా ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. అన్ని ప్రాజెక్టుల్లో భూసేకరణే ప్రధాన సమస్యగా నిలిచిందని తెలిసినా కూడా, అందుకు కావాల్సిన నిధులను మాత్రం సర్కారు విడుదల చేయలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది పరిస్థితి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే 75శాతం మేరకు పనులను పూర్తయిన మొత్తం 18 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. వాటిని ఏ, బీ క్యాటగిరీలుగా విభజించింది. ఏ క్యాటగిరీలోని 6 ప్రాజెక్టులను 2025 మార్చి నెలాఖరునాటికి పూర్తిచేయాలని, తద్వారా ఆయా ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన 47,882 ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక బీ క్యాటగిరీలో మొత్తంగా 12 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. మార్చినెలాఖరులోగా ఏ, బీ క్యాటగిరీలోని ప్రాజెక్టుల పరిధిలో 5.84 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని నిర్దేశించుకున్నది.
ఈ ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన 25 శాతం పనుల పూర్తికి రూ.7,647.09 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. బడ్జెట్లోనూ ఆ మేరకు నిధులను కేటయించింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క పైసాను విదల్చలేదని సాగునీటిశాఖ ఇంజినీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనులు ఒక్క అడుగు కూడా ముందుకుపడడడం లేదని వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోసహా, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జిల్లాల వారీగా, ప్రాజెక్టులవారీగా సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారే తప్ప ఆచరణలో నిధులను మాత్రం విడుదల చేయడం లేదని విమర్శిస్తున్నారు.
ప్రభుత్వం ప్రాధాన్యతగా పెట్టుకున్న 18 ప్రాజెక్టుల్లో కాలువల పనులు పెండింగ్‌లో ఉండడానికి ప్రధాన కారణం భూసేకరణే. కొన్ని చోట్ల రైతులు కేసులు కూడా వేశారని తెలుస్తున్నది. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి దాదాపు 14,696.26 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్నదని ఇరిగేషన్‌శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. అందుకోసం రూ.2,500కోట్లు అవసరమని అంచనా. భూసేకరణ పూర్తయితేనే పనులు ముందుకు సాగుతాయి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడా ఒక్క గుంట భూమిని కూడా సేకరించలేదని ఇంజినీర్లు వివరిస్తున్నారు. దీంతో పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయని తెలిపారు.
ప్రభుత్వం ప్రాధాన్యతగా పెట్టుకున్న ప్రాజెక్టు పనుల పురోగతినే ఇలా ఉంటే ఇంకా పెండింగ్‌లో ఉన్న మేజర్, మీడియం ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పనులను పూర్తిచేయాలంటే రాబోయే 6 నెలలే కీలకమని, ఇప్పటికైన ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, తద్వారా పనులు ముందుకుసాగుతాయని అధికారులు సూచిస్తున్నారు.