Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ డొల్లతనం మరోసారి బయటపడింది. ఎప్పటిలానే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే సభకు వచ్చి మరోసారి నవ్వులపాలైంది. అత్యంత ముఖ్యమైన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం కొన్ని రోజులుగా హడావుడి చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుందని, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతామని, వెంటనే 11 గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు, అధికారులు, మీడియా ఇలా అందరూ టంచనుగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు సభాపతి ప్రసాద్ కుమార్ సభను ప్రారంభించారు. ఆ సమయానికి సభలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులెవరూ లేరు. జాతీయ గీతాలాపన ముగిసిన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ‘మేము సిద్ధంగా లేము.. క్యాబినెట్ సమావేశం ఇంకా పూర్తి కాలేదు. కొద్దిగా సమయం పడుతుంది. దాని తర్వాత మినట్స్, నోట్స్ ప్రిపరేషన్‌కు సమయం పడుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా క్యాబినెట్ సమావేశంలోనే ఉన్నారు. కాబట్టి సభను కాసేపు వాయిదా వేయండి’ అని కోరారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.
సభ మొదలైన రెండు నిమిషాల్లోనే వాయిదా వేయడంపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది. అధికార పార్టీ విజ్ఙప్తి చేయడం, సభను వాయిదా వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితరుల బృందం స్పీకర్‌ను కలిసింది. తామంతా సభా సమయానికే వచ్చామని వారు గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రిపేర్‌గా లేకపోవడం, సభను వాయిదా వేయాలనడం సరికాదని తమ అభ్యంతరాన్ని స్పీకర్‌కు చెప్పారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడారు. ‘గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కమాట కూడా మాట్లాడకుండానే నిమిషంలోనే అసెంబ్లీని వాయిదా వేయడం ఆశ్చర్యానికి గురిచేసింది’ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరుగలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేష్టలతో తెలంగాణ రాష్ట్రం, శాసనసభ పరువు పోయిందని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా? సభ్యులను 11 గంటలకు రమ్మని సభ వాయిదా వేశారు. ఇదేనా బీసీలకు ఇచ్చే గౌరవం?’ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ నిలదీశారు. శాసనసభ రూల్స్, ప్రొసీజర్స్‌ను తుంగలో తొకారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. సభను వాయిదా వేయటం కుట్ర పూరితమని, సభను ఒక్కరోజే నిర్వహించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు, ప్రభుత్వం తరఫున శాసనసభలో స్టేట్మెంట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాల్సి ఉన్నది. కానీ.. దాదాపు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అందరికీ ఉదయం 10 గంటలకే అని చెప్పారు. కానీ, ఆ సమయానికి సీఎం సహా సగం మంది మంత్రులు అసెంబ్లీకే రాలేదు. అందరూ ఆలస్యంగా రావడంతో ఉదయం 10.40 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ ప్రభావం శాసనసభ సమావేశంపై పడింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంత్రివర్గ సమావేశం కొనసాగింది. మంత్రివర్గ సమావేశం ఆలస్యం కావడంతో శాసనసభ తిరిగి ప్రారంభమవ్వడం కూడా ఆలస్యమైంది. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సభ మొదలవుతుందని చెప్పినా 2.20 గంటలకు తిరిగి ప్రారంభమైంది. ఫలితంగా సభ నడవడం కూడా ఆలస్యమై రాత్రి వరకు కొనసాగింది.
ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన శాసనసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదాపడడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన అధికార, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అసలు ప్రిపేర్ కాని వాళ్లు ఇంత హడావుడిగా సభ ఎందుకు పెట్టారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు పెట్టుకొని మరుసటి రోజు శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని, అంతా హడావుడి, గందరగోళమేనని, కులగణన సర్వే కూడా ఇలాగా చేశారని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇంత ఆదరాబాదరా ఎందుకు చేశారని, ఉదయం వచ్చిన ఎమ్మెల్యేల్లో సగం మంది మధ్యాహ్నం రాలేదని, చర్చ అర్థవంతంగా సాగలేదని కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే అన్నారు.
శాసనసభ సమావేశాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం, ప్రభుత్వంలో నిర్వహణ లోపం ఉండటంతో విసిగిపోయిన ఎమ్మెల్యేల్లో ఉదయం వచ్చిన వారిలో సగం మంది మధ్యాహ్నం సభకు గైర్హాజరయ్యారు. ప్రభుత్వం మొక్కుబడిగా, తూతూమంత్రంగా సభ పెట్టిందని, నాన్ సీరియస్‌గా ఉన్నదన్న అభిప్రాయాలను శాసనసభ లాబీల్లో ఎమ్మెల్యేలు వ్యక్తంచేశారు.
‘బీఆర్ఎస్ తరపున 38 మంది సభ్యులం ఉన్నం. బీసీ వర్గాల నుంచి కమలాకర్, వివేక్, చింతా ప్రభాకర్, కాలేరు వెంకటేశ్ తదితర సభ్యులు ఈ అంశంపై సభలో మాట్లాడేందుకు సిద్ధమైనా వారికి అవకాశం ఇవ్వలేదు. తమ ఆవేదన చెప్పుకొందామని వారు అనుకున్నారు. సర్వేలో బీసీల సంఖ్య తగ్గిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూనే బీసీల విషయంలో ఏదైతే కాంగ్రెస్ దగా చేసిందో, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బీసీల గొంతు కోసిందో, 51 శాతం నుంచి 5 శాతం జనాభా తగ్గించి చూపిందో, బీసీల విషయంలో మోసాన్ని, దగాను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.