హైదరాబాద్ : ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అరాకచక పాలనకు తెరలేపింది. ఎన్నికల హామీలను విస్మరించి ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తూ అప్రజాస్వామికంగా పాలిస్తున్నది. ఇన్నేండ్లు రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అధికారంలోకి వచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఊదరగొట్టారు. ఉద్యమాలను అడ్డుకోమని నమ్మించిన ఆ పార్టీ వంచనకు బీజం వేసింది.
తీరా అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. హక్కులు, ఉద్యమాలు అంటూ ప్రవచించిన ఆ పార్టీ మేకవన్నె ముసుగును తొలగించుకొని నేడు బహిరంగానే హక్కుల హననాకి పాల్పడుతున్నది. ప్రశాంతమైన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్లోల పరిస్థితులను సృష్టిస్తున్నది.
తాజాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్(Police Act) దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పై రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతున్నది. నిరసనలు, ధర్నాలు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి, మంత్రులను అడ్డుకోవడం వంటి తదితర అంశాలపై ఇంటలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో రేవంత్ సర్కార్ అలెర్ట్ అయింది. రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు పెరిగే అవకాశం ఉన్నందున.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ ను అమలు చేసేందుకు సిద్ధపడింది.
ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుంచి 7వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలు కానున్నట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్లు మార్పు కోసం కాంగ్రెస్ను గెలిపిస్తే మమ్ములను నట్టేట ముంచుతున్నదని, మేధావులు, కవులు, కళాకారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. నాటి కేసీఆర్ పాలనే బాగుందని గుర్తు చేసుకుంటున్నారు.