హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. విడతలవారీగా జాబితాలు ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ చివరి క్షణంలో కూడా అభ్యర్థులను మార్చేశాయి. పార్టీ అధిష్ఠానాలు తమను అభ్యర్థులుగా ప్రకటించిన వెంటనే ఆయా నేతలు వెంటనే ప్రచారంలోకి దిగిపోయారు. నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న దశలో టికెట్లు రద్దవడంతో లబోదిబోమంటున్నారు.
కాంగ్రెస్ పటాన్చెరు అభ్యర్థిగా తొలుత నీలం మధును ప్రకటించి, చివరికి కాటా శ్రీనివాస్‌కు బీ ఫారం అందజేసింది. నారాయణఖేడ్ నుంచి సురేశ్షేట్కార్ పేరును ప్రకటించి, సంజీవరెడ్డికి బీఫారం ఇచ్చింది. కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ మంది అభ్యర్థులను మార్చింది. బెల్లంపల్లి నుంచి అమరాజుల శ్రీదేవి, ఎమాజీతో దోబూచులాడింది. చాంద్రాయణగుట్ట నుంచి సత్యనారాయణ పేరు ప్రకటించి.. మహేందర్‌తో నామినేషన్ వేయించారు.
వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి పేరు ప్రకటించి అనుజ్ఞరెడ్డికి బీఫారం ఇచ్చింది. వేములవాడ టికెట్‌ను తుల ఉమకు కేటాయించి, వికాస్‌రావుకు బీ ఫారం అందజేసింది. సంగారెడ్డికి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండేను ప్రకటించి పులిమామిడి రాజుకు బీఫాం ఇచ్చింది. ఎంఐఎం కూడా రాజేంద్రనగర్ అభ్యర్థిగా తొలుత రవియాదవ్‌ను ప్రకటించి చివరకు స్వామియాదవ్‌ను బరిలోకి దించింది. ఆఖరిక్షణంలో భంగపడ్డ పలువురు రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు.