హనుమకొండ, మే 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసానికి నిరసనగా బీఆర్ఎస్ ఈ నెల 6న వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన రైతు ప్రతినిధుల సదస్సుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 వేల మంది రైతులతో ఈ సదస్సు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సదస్సు నిర్వహణ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనేతలు సమన్వయంతో పనిచేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన స్థలాలను ఇప్పటికే గుర్తించారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో సదస్సుకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
2022 మే 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా వరంగల్‌కు వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. సాగునీరు, కరెంటు సరిగా లేక పంటలను కాపాడుకునేందుకు, యూరియా కోసం ఇబ్బందులుపడ్డారు. వడ్లు, మక్కల కొనుగోలు ప్రక్రియలో సర్కార్ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు బీఆర్ఎస్ భరోసా కల్పిస్తున్నది.
కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని తెలియజెప్తున్నది. ఈ ప్రక్రియలో భాగంగానే.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే బీఆర్ఎస్ రైతు ప్రతినిధుల సదస్సు నిర్వహిస్తున్నది. సదస్సు నిర్వహణ, విజయవంతం కోసం చేసే ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనేతలు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌కు అవకాశమిస్తే యూరియా కొరత, చెప్పుల వరుసలు ఉంటాయని గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు అదే జరుగుతున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన హీనంగా ఉన్నదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రోజులు మళ్లీ వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు.
కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధించారని, తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపారని కొనియాడారు. సాగునీటి రంగంలో కేసీఆర్ చేసిన కృషితో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని, కాంగ్రెస్ అవగాహనారాహిత్యంతో ఇప్పుడు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేసీఆర్ పరిపాలనను, కాంగ్రెస్ సర్కార్ తీరును పోల్చి చూడాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది, రైతుల కోసం పాటుపడేది బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టంచేశారు.
మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రైతుద్రోహి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కేసీఆర్ పంటల పెట్టుబడి కోసం రైతుబంధు ఇస్తే.. రేవంత్‌రెడ్డి ఎకరానికి రూ.15 వేలు చొప్పున అని ఎగవేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన మోసాలను రైతులకు గుర్తుచేసేందుకు రైతు సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పరిపాలనలో రైతులు సాగునీరు, యూరియా కొరత, కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. మక్కజొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. కాంటాకు బస్తాలు, రవాణాకు వాహనాలు లేవని చెప్పారు. మక్కజొన్న, వడ్లను కొనకుండా ప్రభుత్వం రైతులను తీవ్రంగా దోపిడీకి గురిచేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్తే రైతులు ఉరికించి కొట్టే పరిస్థితి ఉన్నదని తెలిపారు. రైతు సమస్యల కోసం పోరాడేందుకు వరంగల్‌లో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌తో చేసిన మోసాన్ని రైతులకు తెలియజెప్పేందుకు, రైతుల తరఫున పోరాడేందుకు రైతు సదస్సు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు సదస్సు నిర్వహణకు ప్రభుత్వ స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇవ్వడంలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక రకాలు ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం పని చేయడంలేదని ఆరోపించారు. సాగు, తాగునీరు, పంటల కొనుగోలు కోసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు.
ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాపై పెత్తనం చెలాయిస్తున్నాడని దుయ్యబట్టారు. పొంగులేటి కాంట్రాక్టుల కోసమే సమీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రజల కోసమో, సమస్యల పరిష్కారానికో సమీక్షలు చేయడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, నాయకులు బడే నాగజ్యోతి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మక్కజొన్న, వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ రైతులను నిండా ముంచుతున్నదని మండిపడ్డారు. రైతుబంధు పథకంలో కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు ఇస్తే రూ.15 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మొత్తానికి ఎగవేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరా టం కొనసాగుతుందని హెచ్చరించారు.