రుద్రంపూర్, ఆగస్టు 10 : సింగరేణిలో 12వ వేతన కమిటీని ఏర్పాటు చేసి, చర్చల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి, ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ జూలై 1, 2026 నుంచి 12వ వేతన ఒప్పంద కాలపరిమితి ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు వేతన కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల వేతనాలు, అలవెన్సులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏ సంఘానికీ 51 శాతం ఓట్లు రాని పరిస్థితిని సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల పేరుతో వేతనాల పెంపు ప్రక్రియను వాయిదా వేయడం కార్మికుల హకులను హరించడమే అవుతుందన్నారు. కార్మికుల సహనాన్ని పరీక్షిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్మికులు నినాదాలు చేస్తూ జీఎం కార్యాలయాన్ని ముట్టడించారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శులు గట్టయ్య, రమణమూర్తి, ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, క్రిస్టోఫర్, ఆఫీస్ బేరర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్, బి.రాజేశ్వరరావు, జె.రాజేశ్వరరావు, సకినాల సమ్మయ్య, అభిషేక్, కుమారస్వామి, సీఐటీయూ అధ్యక్షుడు మంద నర్సింహారావు, విజయగిరి శ్రీనివాస్, వై.వెంకటేశ్వర్లు, రాజబాబు, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.