కొండమల్లేపల్లి, మే 15: బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆరోపించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి అంబేద్కర్ చౌరస్తాలో దాదాపు 500 మంది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధాన్యం తగులబెట్టి రాస్తారోకో, ధర్నాతో నిరసన వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో రైతులు వ్యవసాయం చేసి బంగారం కొంటే.. రేవంత్ సర్కార్ హయాంలో ఉన్న బంగారం అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏసీలలో కూర్చొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కాదు.. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.