Telangana | ఎల్బీనగర్, మార్చి 10: నిరుద్యోగులు రగిలిపోయారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.. ఆందోళన బాటపట్టారు. జీవో 46ను రద్దు చేయాలని, గ్రూప్ 1,2,3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద ఆదివారం ధర్నాకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతతో కలిసి ఓ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడైన అశోక్ ఇందిరాపార్కు వద్దకు వెళ్లేందుకు యత్నించగా, అనుమతి లేదని పోలీసులు పేర్కొనడంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని తన ఇన్స్టిట్యూట్ వద్దే ఆయన ఆందోళనకు దిగారు. ఈ దశలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకోగా, పోలీసులు అశోక్‌ను అరెస్టు చేసి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ధర్నా కార్యక్రమం కాస్తా అందోళనకు దారితీసింది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు దిల్సుఖ్నగర్ కూడలి వద్దకు చేరుకొని అక్కడి నుంచి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొన్నది. డీఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచాలని, గురుకుల రిక్రూట్‌మెంట్‌ను అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఖాళీలు చాలా ఉన్నా ప్రభుత్వం చాలా తక్కువ పోస్టులనే భర్తీ చేస్తున్నదని, 1,600 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 182 మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వం చూపిందంటూ నిరుద్యోగులు విమర్శించారు.
సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చి అశోక్‌ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో వ్యక్తిగత పూచీకత్తుపై అశోక్‌ను విడుదల చేశారు. జీవో 46 రద్దు చేయాలని, గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌తో చైతన్యపురిలోని తన ఇంటి వద్ద అశోక్ ఆమరణ దీక్ష చేపట్టారు. గ్రూప్1లో 750, 2లో 2వేలు, 3లో మూడు వేల ఖాళీలను పెంచాలని, టెట్ పరీక్ష జర పాలని, డీఎస్సీ ఉద్యోగాల సంఖ్యను పెం చాలని, జీవో 46ను రద్దు చేయాలని అశోక్ డిమాండ్ చేశారు. అంతకు ముందు దిల్సుఖ్నగర్ రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగిన నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రా జ్యం.. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం.. అన్న నిరుద్యోగ అభ్యర్థుల నినాదాలు మార్మోగాయి. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. తన ఇంటిలోనే నిరాహారదీక్ష చేపట్టారు.
పాలమూరు, మార్చి 10 : ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గ్రంథాలయ ఆవరణలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము జాన్సన్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే డీఎస్సీలో సోషల్ స్టడీస్ పోస్టులు పెంచాలని, గ్రూప్-2, గ్రూప్-3లోనూ పోస్టులు పెంచాలని, టెట్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.