Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పదేండ్ల క్రితం ఇంటికి ఏర్పాటు చేసిన దర్వాజలకు వాడిన కలపను అడవి నుంచి అక్రమంగా తీసుకువచ్చారని బెదిరించి రూ.30 వేలు వసూలు చేశారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం లెండిగూడ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక ఎడ్లను అమ్మి వారికి లంచం కట్టినట్టు పేర్కొన్నారు. ఇదే విషయమై శుక్రవారం అటవీ అధికారులపై డీఎఫ్‌వో కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. లెండిగూడకు చెందిన మడావి రాము, మరప సాగర్ పదేండ్లకు ముందే నిర్మించిన ఇండ్లల్లో ఉంటున్నారు.
ఈ నెల 4న ఆ ప్రాంతంలో అటవీ శాఖ ఎఫ్ఎస్వో రాందాస్, ఎఫ్‌బీవో వనిత ఆదివాసీల ఇండ్లల్లో కలప ఉన్నదని అనుమానిస్తూ తనిఖీలు చేశారు. కలప దొరకకపోయేసరికి వారి ఇంటికి ఉన్న తలుపులు పాతవి కాదని, కొత్తగా ఏర్పాటు చేశారని, అందుకు వాడిన కలపను అడవిలో నుంచి అక్రమంగా తీసుకువచ్చారని, జరిమానా విధించి కేసులు పెడుతామని బెదిరించారు.
రూ.30 వేలు ఇస్తే కేసులు లేకుండా వదిలేస్తామని చెప్పడంతో చేసేదేమీలేక తమకున్న ఎద్దులను అమ్మి అధికారులకు ముడుపులు ముట్టజెప్పినట్టు బాధిత ఆదివాసీలు వాపోయారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కనక యాదవ్రావ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అటవీ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎఫ్ఎస్వో రాందాస్‌ను వివరణ కోరగా వారి ఇండ్లల్లో ఎలాంటి తనిఖీ చేయలేదని, ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని తెలిపారు.