Congress Govt | వరంగల్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సాధికారతకు పాటుపడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు. క్రీడాపాలసీని తెస్తామని, మైదానాలను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెప్తున్న మాటలు సత్యదూరమని తెలుస్తున్నది. ఇందిరా మహిళా శక్తి పేరిట మంగళవారం హనుమకొండలో నిర్వహించే బహిరంగసభ కోసం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే ఇందుకు నిదర్శనం.
స్టేజీ, టెంట్లు, బారికేడ్లు, లైటింగ్, సౌండ్స్ ఏర్పాటు చేసేందుకు గ్రౌండ్ అంతటా ఇష్టం వచ్చినట్టుగా రంధ్రాలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమం కావడంతో అధికారులే దగ్గరుండి అన్ని పనులూ చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మహిళలు, సాధారణ జనం వచ్చేందుకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు ఉన్న ప్రహరీని మూడు చోట్ల కూల్చేశారు. ఈ గ్రౌండ్‌కు రెండు గేట్లు ఉండగా, మరో మూడు చోట్ల ప్రహరీ కూల్చడంపై క్రీడాకారులు, వాకర్స్ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. కలెక్టరేట్, డీఐజీ బంగ్లా మధ్యలో ఉన్న ఈ మైదానానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేల మంది వాకింగ్, ఆటల కోసం వస్తుంటారు. డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఈ గ్రౌండ్లో నిత్యం జరుగుతుంటాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 లక్షలతో అభివృద్ధి చేసింది. రూ.20 లక్షల చొప్పున రెండు దశల్లో నిధులు కేటాయించి వాకర్స్ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను, సోలార్ లైట్లను ఏర్పాటు చేసింది. మహిళలకు ఇబ్బంది లేకుండా మొబైల్ టాయిలెట్ సదుపాయం కల్పించింది. ఇలాంటి గ్రౌండ్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగసభ కోసం ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేయడంపై విమర్శలొస్తున్నాయి.
‘ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు’లో భాగంగా ఇందిరా మహిళాశక్తి పేరిట హనుమకొండలో నిర్వహిస్తున్న బహిరంగసభ విజయవంతం చేసేందుకు జన సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు టార్గెట్లు విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఊరిలోని స్వయం సహాయక బృందాల్లోని (ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఈ సభకు కచ్చితంగా రావాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారు (డీఆర్డీవో)లకు మహిళా జనసమీకరణ బాధ్యతలను అప్పగించింది. ఎంపీడీవోలు, వీ వోలు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులలోని ప్రతి మహిళలను సభకు రావాలని ఒత్తిడి తెస్తున్నారు. జనసమీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 900 ఆర్టీసీ బస్సులను వాడుకుంటున్నది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే 150 బస్సులను కేటాయించింది.