కరువొస్తున్నది. పంటలు ఎండిపోతున్నయి. పంటలకు సాగు నీళ్ల కోసం ప్రత్యామ్నాయ చర్యలేమైనా తీసుకుంటున్నారా?
-మీడియా సమావేశంలో సీఎం
రేవంత్‌రెడ్డిని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఏమున్నది వీళ్లను (కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి) కోసి రక్తం చల్లితే పంటలు అవే పండుతయ్. వీళ్ల బలుపు, కొవ్వు పంటలకు సరిపోతది.
కరువొస్తున్నది పంటలకు నీళ్లు ఎలా ఇస్తారనే జర్నలిస్టు ప్రశ్నకు బాధ్యత మరిచిన సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన అత్యంత జుగుప్సాకరమైన సమాధానమిది.
హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): పంటలను నీళ్లతో కాకుండా రక్తంతో పారిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా సాక్షిగా చెప్పడం ఆయన క్రూర మనస్తత్వానికి నిదర్శమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలకు నీళ్లు ఇవ్వడం చేతగాక.. ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సాగు నీళ్లు ఇవ్వాలని అడిగిన ప్రతిపక్షాల చావు కోరుకున్న సీఎం, కన్నెపల్లి పంపులు ఆన్‌చేసి నీళ్లు ఎత్తిపోయాలని అడిగిన రిటైర్డ్ ఇంజినీర్లను చర్లపల్లి జైలుకు పంపిస్తానంటూ బెదిరించారు. కరువొస్తదని హెచ్చరించిన అధికారులకు బెల్ట్ ట్రీట్మెంట్ (బెల్ట్‌తో కొట్టాలని) ఇవ్వాలని చిందులు తొక్కారు. ఓవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖంచాటేశాయి. మరోవైపు వేసిన పంటలు ఎండిపోతున్నాయి.. పంట వేయడానికి వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు గోదావరి, ప్రాణహిత వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ నుం చి గోదావరి జలాలు వృథాగా కిందికి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నీళ్లను కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా ఎత్తిపోసి ప్రాజెక్టులు నింపి రైతులకు సాగు నీళ్లు ఇవ్వాలని కేటీఆర్, హరీశ్‌రావు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు నీళ్లు ఇవ్వాలని అడగడమే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేసిన పాపమన్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి వాళ్ల చావును కోరుకోవడం గమనార్హం. పంటలకు సాగు నీళ్లు ఇవ్వాలని అడిగితే.. సాగు నీళ్లు కాదు.. ప్రతిపక్ష నేతలను కోసి వాళ్ల రక్తాన్ని పంటలపై చల్లి పంటలు పండిస్తానంటూ చెప్పడం ఆయనకే చెల్లిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థాయిలో ఉంటూ బజారు భాష, రౌడీ భాష మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో రౌడీయిజా న్ని ప్రోత్సహించేలా, రక్తపాతాన్ని సృష్టించేలా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఓవైపు కరువుతో రైతులు అల్లాడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎకసెక్కాలాడుతున్నారు. ‘కరువొచ్చింది అయితే ఏం చేస్తాం’ అంటూ తీవ్ర నిర్లక్ష్యపు మాటలు మాట్లాడారు. అంతేకాదు.. ‘కేసీఆర్, హరీశ్‌రావుకు కాంట్రాక్ట్ ఇస్తాం వర్షాలు కురిపించమని చెప్పండి.. మంత్రాలు చేస్తరో, తంత్రాలు చేస్తరో ఏం చేస్తరో చెయ్యిమనండి’ అంటూ’ వెటకారపు మాటలు మాట్లాడటం గమనార్హం.
కరువు కారణంగా కన్నెపల్లి పంప్‌ను ఆన్‌చేసి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చని, ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పిన రిటైర్డ్ ఇంజినీర్లపై సీఎం రేవంత్‌రెడ్డి ఒంటికాలిపై లేచారు. ఏకంగా వాళ్లను చర్లపల్లి జైలుకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. కన్నెపల్లి పంప్ నుంచి నీటిని ఎత్తిపోస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోదని రిటైర్డ్ ఇంజినీర్లు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డికి మింగుడు పడలేదు. ‘శ్యామ్ ప్రసాద్‌రెడ్డి నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. ఎందుకంటే చర్లపల్లి జైలుకు పంపలేదు కదా? చర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసుండేది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘వాళ్లను బొక్కల వేయకపోవడమే మా తప్పు. అందుకు ఇప్పుడు వచ్చి బేవకూఫ్ సలహాలు ఇస్తున్నరు’ అంటూ తన అసహనాన్ని బయటపెట్టారు. ఇక ఎల్ నినో కారణంగా కరువు వస్తుందని చెప్పిన అధికారులకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తేగానీ వారంతా దారికిరారని చెప్పడం గమనార్హం.
ప్రస్తుతం మేడిగడ్డ నుంచి సుందిళ్లకు నీళ్లు ఎత్తిపోసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు. ‘ప్రస్తుతం మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయడం సాధ్యం కాదంటున్న మీరు.. మీ ప్రభుత్వం చేపట్టిన తమ్మిడిహట్టి ప్రాజెక్టు నుంచి సుందిళ్లకు అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లను ఎలా తరలిస్తామని చెప్తున్నరు? ఇది ఎలా సాధ్యం’ అని ఓ విలేకరి ప్రశ్నించడంతో మంత్రి ఉత్తమ్‌కుమారెడ్డి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. వెంటనే సదరు విలేకరిపై మంత్రి నోటి దురుసు ప్రదర్శించారు. ‘తెలివి ఎక్కువతో మాట్లాడుతున్నవ్’ అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. ‘మేం రేపే నీళ్లు తెచ్చి పెట్టడం లేదు.
సుందిళ్ల రిపేర్ చేసిన తర్వాతే తీసుకొచ్చే అవకాశం ఉన్నది’ అంటూ సమాధానం దాటవేశారు. ఆ తర్వాత సీఎం కల్పించుకొని ‘తమ్మిడిమట్టి పూర్తి చేయాలంటే రెండుమూడేండ్లు పడుతది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను పునరుద్ధరిస్తామని చెప్తున్నం’ అని తెలిపారు. అంటే కాంగ్రెస్ చేపట్టే తమ్ముడిహట్టి ప్రాజెక్టు కోసమైతే సుందిళ్లను వినియోగించుకుంటారు. అప్పటి వరకు దాన్ని రిపేర్ చేస్తారు. ఇప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసేందుకు ఎందుకు వినియోగించరు? ఇప్పుడే సుందిళ్లను ఎందుకు రిపేర్ చేయడం లేదు? అనే ప్ర శ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక దశలో ఎక్కువ ప్రశ్నలు, సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులపై సీఎం బీఆర్ఎస్ ముద్ర వేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
ప్రతిపక్షాలపైనే కాదు రైతులపైనా రేవంత్‌రెడ్డి తన ఫ్రస్ట్రేషన్ చూపించారు. రైతులు ఎన్నిసార్లు చెప్పినా మాట వినడం లేదంటూ ఒకింత అసహనం వ్యక్తంచేశారు. ‘కరువొస్తుంది.. వరిసాగు చేయొద్దు.. ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని ఎన్నిసార్లు, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నం?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కరువు వచ్చింది.. అందుకే ఆరుతడి పంటలు వేయండి అని ఆర్నెళ్ల నుంచి మొత్తుకుంటున్నం. నీళ్లు అధికంగా వాడే పంటలు వేయొద్దని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నం? మీరంతా ఉన్నరు కదా? ముందు నుంచీ సూచన చేస్తూనే ఉన్నం. ఇప్పుడు కూడా మా సూచన ఒక్కటే.. ఆరుతడి పంటలు వేయండి. వరి ఎక్కువ వేస్తే నీళ్లు ఎక్కువ అవసరం.. దాంతో పంటలు నష్టపోతరు. అందుకే ఆరుతడి పంటలు వేయండి’ అంటూ రైతులకు హుకుం జారీ చేశారు. మొత్తానికి సాగు నీళ్లు ఇవ్వలేమని, రైతులే తమ వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలని సీఎం ఉచిత సలహా ఇచ్చారు.