SSC | హైదరాబాద్,నవంబర్ 28 (నమస్తేతెలంగాణ): పదో తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. ఇప్పటివరకు ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానాన్ని 2024-25 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఐదు పరీక్షలకు 24 పేజీల బుక్లెట్(ఆన్షర్‌షీట్)ను ఇవ్వనుండగా, సైన్స్ సబ్జెక్ట్‌కు మాత్రం ఫిజికల్ సైన్స్‌కు 12 పేజీలు, బయాలజికల్ సైన్స్‌కు 12 పేజీల చొప్పున బుక్లెట్లను అందజేయనున్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో పారదర్శకత కొరవడిందని ఆరోపణలు వచ్చాయి. కొంద రు ఉపాధ్యాయులు ఉద్ధేశపూర్వకంగా కొంద రు విద్యార్థులకు ఎక్కువ, మరికొందరికి తక్కు వ మార్కులు వేస్తున్నారనే విమర్శలు వచ్చా యి. దీంతో ఈ పద్ధతిని పాఠశాల విద్యాశాఖ తొలగించింది.
2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్లో ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఇంటర్ ఫస్టియర్‌లో సీట్లు కేటాయిస్తారు. ఇందుకోసమే పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని రద్దుచేసి, మార్కుల విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లను (దోస్త్ పోర్టల్ ద్వారా) ఆన్లైన్లోనే చేపడుతున్నారు. ఇంటర్లో విద్యార్థులు సాధించిన మార్కులు, మెరిట్ ఆధారంగా విద్యార్థుల నుంచి ఆప్షన్లు స్వీకరించి, సీట్లు కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు హయాం(2015) నుంచే ఈ విధానం విజయవంతంగా అమలవుతున్నది. ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్టపడింది. ఇదే తరహాలో ఇంటర్‌లోనూ ఆన్లైన్ అడ్మిషన్లు చేపట్టాలన్న డిమాండ్లున్నాయి. అయితే పదో తరగతిలో అమలుచేస్తున్న గ్రేడింగ్ ఆధారంగా ఇంటర్లో సీట్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో పదో తరగతిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, గ్రేడింగ్ పద్ధతిని రద్దుచేశారు. కొత్తగా ఈ మార్కుల విధానంతో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల అడ్మిషన్ దందాకు చెక్‌పడనుంది. ఆన్లైన్ అడ్మిషన్లతో విద్యార్థి తనకు నచ్చిన కాలేజీలో.. నచ్చిన చోట చేరేవీలుంటుంది.
పదో తరగతిలో గ్రేడింగ్ విధానం తొలగింపును స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి తుకారం అన్నారు. ఇంటర్నల్ మార్కుల తొలగింపు విద్యార్థుల ఉన్నతికి మేలు చేస్తుందని, ఉపాధ్యాయులపై కూడా భారం తగ్గి బోధనపై దృష్టిపెట్టే అవకాశం కలుగుతుందని గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన తరగతులకు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు.