మక్తల్, ఆగస్టు 20 : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో బీడు భూములకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లెఫ్ట్ లోలెవెల్ కెనాల్‌కు గండిపడింది. మంగళవారం కురిసిన వర్షానికి నీటి ఉధృతి పెరగడంతో కోతకు గురై పంట పొలాలను ముంచెత్తింది. కేసీఆర్ ప్రభుత్వం సంగంబండ నిర్వాసితులకు కూలీ డబ్బులు చెల్లించేందుకు 2023 ఆగస్టు 24న జీవో 925 తీసుకొచ్చింది. సంగంబండ, ఉజ్జల్లి, గార్లపల్లికి రావాల్సిన రూ.26,35, 23,410 విడుదల చేసింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో నిధుల చెల్లింపు జరగలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఈ నిధులను తామే విడుదల చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే ముంపు గ్రామాలు తిరిగి ప్రచారం చేసుకున్నారు.
400 మీటర్ల బండను పగలగొట్టేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గాలి మోటర్లో ఇక్కడికొచ్చి హల్చల్ చేశారు. గాలి మాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. తర్వాత చేపట్టిన కాల్వ పనులు నాసిరకంగా ఉండటంతో చిన్నపాటి వర్షానికే గండిపడింది. దీంతో నీరంతా వృథాగా పోయి సమీపంలోని పంటల పొలాలను ముంచెత్తింది. నాసిరకం పనులతో కాల్వ తెగిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.