హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న నవీన్ మిట్టల్ వరుసగా వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పెండింగ్ ఫైళ్లు, ధరణి, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ధరణిలో ప్రస్తుతమున్న మాడ్యూల్స్, పరిష్కార మార్గాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు తెలిసింది.
శాఖపై, క్షేత్రస్థాయి పరిస్థితులపై మరింత అవగాహన పెంచుకునేందుకు ఆయన త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా అధికారులతోనూ సమీక్షలు జరుపనున్నారు. ధరణి లావాదేవీలు ఎలా ఉన్నాయి? ఇబ్బందులు ఎదురవుతున్నాయా? పెండింగ్ దరఖాస్తుల పరిస్థితి.. తదితర అంశాలను తెలుసుకోనున్నారు.