మహబూబ్‌నగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో నిర్మించిన చెక్‌డ్యాం వాల్కట్ట వరదకు కొట్టుకుపోయింది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలై పనుల్లో డొల్లతనం బయటపడింది. నాణ్యతను పరిశీలించాల్సిన కొందరు అధికారులు.. కాంట్రాక్టర్లతో లాలూచీకి పాల్పడినంత కాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో సుమారు రూ.121 కోట్లకుపైగా వెచ్చించి 27 చెక్‌డ్యాంలు నిర్మించారు. కానీ ఎంత వరద వచ్చినా నేటికీ చెక్కు చెదరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలంలో రూ.4.60 కోట్లు వెచ్చించి రాచాల-గుడిబండ శివారు మధ్యలో ఉన్న పెద్దవాగుపై ఒకే ఒక చెక్‌డ్యాం నిర్మించారు.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ప్రధాన అనుచరులే సబ్‌కాంట్రాక్టు దక్కించుకొని పనులు పూర్తిచేశారు. నిర్మించి 2 నెలలైనా గడవక ముందే చెక్‌డ్యాం వాల్కట్ట కొట్టుకుపోవడంపై కాంగ్రెస్ పరిపాలన, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణ సమయంలో గుడిబండ వైపు అదే మండలంలోని పెద్దమునగల్‌చేడ్ గ్రామ చెరువుకు వరద పారేందుకు ఉన్న పాటు కాల్వను చెక్‌డ్యాం నిర్మించేటప్పుడు కొంచెం పొడవు వేయాలని కోరినా వినలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అందుకే కట్ట కొట్టుకుపోయిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో వరి పంట పూర్తిగా వరద పాలైందని రైతు గొల్ల మోహన్ ఆవేదన చెందాడు.
అంతేకాకుండా వ్యవసాయ బోరు కోసం ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్, పోల్స్, పైపులైన్ మొత్తం కొట్టుకుపోయినట్టు వాపోయాడు. మళ్లీ పొలాన్ని యథావిధిగా చేసుకునేందుకు తనకు స్థోమత లేదని పేర్కొన్నాడు. సాగుకు పనికొచ్చేలా పొలాన్ని చదును చేసి ఇవ్వాలని వేడుకుంటున్నాడు. కొట్టుకుపోయిన చెక్‌డ్యాంను మంగళవారం ఇరిగేషన్ ఈఈ వెంకటయ్య, డీఈ రమేశ్, ఏఈ తులసీరాం పరిశీలించారు. చేపట్టిన పనులపై అంచనాలు రూపొందించారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా.. పాటు కాల్వ కట్ట కొట్టుకుపోయిందని, దీంతోపాటు కొంతమేర చెక్‌డ్యాం కట్ట కొట్టుకుపోయిందని చెప్పారు. అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇందులో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చెక్‌డ్యాం పనులను నాసిరకంగా చేపట్టిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పాలకులకు కమీషన్లపై ఉన్న శ్రద్ధ.. పరిపాలన, నాణ్యతపై లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 27 చెక్‌డ్యామ్‌లతో మేలు జరిగిందని చెప్పారు.