హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(సీఆర్ఐఎఫ్) నిధుల విడుదలలో కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపిస్తున్నది. పన్నులు, సెస్‌ల రూపంలో తెలంగాణ నుంచి కోట్ల రూపాయలు వసూలుచేస్తున్న కేంద్రం.. నిధుల విడుదలలో మాత్రం మొండిచేయి చూపిస్తున్నది. పైగా, తామిచ్చిన నిధులతోనే రాష్ట్రంలో ఖర్చులు చేస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి కేంద్రం సీఆర్ఐఎఫ్ కింద రోడ్ల అభివృద్ధికి రూ.3,314 కోట్లు మంజూరు చేసింది. కానీ, రూ.1,744.91 కోట్లే విడుదల చేసింది. కేంద్రం నుంచి నిధులు రాకున్నా, మంజూరు చేసిందన్న ఆశతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో రోడ్లను అభివృద్ధి చేసింది. అలా రాష్ట్రం ఇప్పటి వరకు రూ.2,078.12 కోట్లు సీఆర్ఐఎఫ్ రోడ్లకు ఖర్చు చేసింది. ఖర్చు చేసిన నిధుల నుంచే రాష్ర్టానికి రూ.333.12 కోట్లు రావాల్సి ఉన్నది. ఇవి కాకుండా కేంద్రం 2022-23లో మరో రూ.878 కోట్లు మంజూరు చేసింది. ఈ రకంగా కేంద్రం నుంచి మొత్తం రూ.1,211.21 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉన్నది. కానీ, చివరి నాటికి మరో రూ.250 కోట్లు మాత్రమే విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడూ ఖర్చు చేసిన మేరకు కేంద్రం నిధులు విడుదల చేయలేదు. ఫలితంగా కేంద్రం నుంచి వందల కోట్ల బకాయిలు అలాగే మిగిలిపోతున్నాయి.
రాష్ట్రం నుంచి వసూలు చేసిన సెస్ 5 వేల కోట్ల పైనే
కేంద్రం ఆయా రాష్ర్టాల్లో రోడ్ల అభివృద్ధి కోసం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు ఒక్క రూపాయి చొప్పున సెస్ వసూలు చేస్తుంది. ఇది పెట్రోల్, డీజిల్ రేట్లలోనే కలిపి ఉంటుంది. రాష్ట్రం నుంచి దాదాపు 5 వేల కోట్లకు పైగా వసూలైంది. కానీ కేంద్రం రాష్ర్టానికి కేటాయించింది రూ.1,744.91 కోట్లే. ఆ లెక్కన.. వసూలైన సొమ్ములో సగం కూడా రాష్ర్టానికి ఇవ్వలేదు. జనాభా ప్రాతిపదికన విడుదల చేస్తున్నామని నిబంధనల బూచీ చూపి, నిధులను ఎగనామం పెడుతున్నది. నిబంధనల మేరకు ఏటా రూ. 250 కోట్లు ఇస్తామని చెప్తున్న కేంద్రం.. ఆ నిధులు కూడా విడుదల చేయలేదు. ఏటా 250 కోట్ల చొప్పున లెక్కించినా ఎనిమిదేండ్లలో దాదాపు రూ.2 వేల కోట్లు రాష్ర్టానికి రావాలి. కానీ ఆ మొత్తం కూడా రాలేదు. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షకు ఇది చిన్న ఉదాహరణే.