హైదరాబాద్ ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా చేపట్టనున్న ఏక్తామాల్ ప్రాజెక్టుపై వివరణ ఇవ్వాలని రేవంత్ సర్కార్‌ను కేంద్రం ఆదేశించింది. వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు, వ్యయ వివరాలు సమర్పించాలని కోరింది. ఏక్తామాల్ అనుమతుల్లో అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ముందుగా ప్రజల ముందుంచింది. దీనిలో లోపాలను పాఠకలోకానికి ఎత్తి చూపింది. ఈ క్రమంలో ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ చేపట్టాలని ఈ నెల 10న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఆ తర్వాత 12న బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఆందోళనలు చేపట్టింది. ఆ తర్వాత లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. దీంతో కేంద్రం స్పందించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగం డిప్యూటీ సెక్రటరీ ఆగస్టు 19న లేఖ రాశారు. ఏక్తామాల్కు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పత్రాలు..డీపీఆర్‌లో తేడాలున్నాయని ఇందుకు వివరణ ఇవ్వడంతో పాటు అనుమానాలు నివృత్తి చేయాలని, ప్రాజెక్టు వివరాలను సమగ్రంగా నివేదించాలని ఆదేశించారు.