హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలు, రవాణా ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన రోడ్లను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర సర్కారు ఆశలు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఆవిరైపోతున్నాయి. ఇతర రాష్ర్టాలను కలిపే అంతర్రాష్ట్ర రోడ్లు, జి ల్లా కేంద్రాలను కలిపే రోడ్లు సహా పారిశ్రామికవాడలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలని 2015-16లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రోడ్లు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. పలుమార్లు విజ్ఞప్తిచేసింది. అయినా ఫలితంలేదు. సుమారు 1,617 కిలోమీటర్ల పొడవు రోడ్లను అభివృద్ధి చేయడం ద్వారా రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి.
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రతిపాదన పంపితే.. దాన్ని మంజూరు చేయడమో, ఒకవేళ అది సాధ్యంకాని పక్షంలో తిరస్కరించడమో, లేక సవరణలు సూచించడమో చేయాలి. కానీ, పదేండ్లుగా కేంద్రం ఈ ప్రతిపాదనలపై ఎటూ తేల్చడం లేదు. బీజేపీ లేదా ఎన్డీఏ పాలిత రాష్ర్టాలైతే కేంద్రం వైఖరి ఇలాగే ఉంటుందా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ‘సబ్ కా సాథ్, సబ్కా వికాస్’ అని చెప్పుకునే కేంద్ర సర్కారు, ఆచరణలో మాత్రం పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక కొత్త పారిశ్రామికవాడలను ఏర్పాటుచేయడంతోపాటు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. పర్యాటకంతోపాటు ఆలయాలను సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. జిల్లాల సంఖ్యను పెంచి పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అంతేకాదు, సరిహద్దు రాష్ర్టాలతో వ్యాపారాలు కూడా వృద్ధి చెందాయి. పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం, పారిశ్రామికవాడలకు రాకపోకలు, సరుకు రవాణా తదితర కార్యకలాపాలు వృద్ధి చెందాయి. దీంతో ప్రస్తుతం సింగిల్, డబుల్ రోడ్లుగా ఉన్న ఈ రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి 4 లేన్ల రోడ్లుగా అభివృద్ధి చేయాలని అప్పటి బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది.
జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ హయాంలోనే ప్రతిపాదించిన రహదారుల వివరాలు
