హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం’ అని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎప్పుడో గాలిలో కలిసిపోయింది. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు తేవడం, ఉద్యోగాలు కల్పించడం చేతగాక.. ‘పకోడీ వేసుకోవడం కూడా ఉపాధి కిందికే వస్తుంది’ అని కేంద్ర మంత్రి ఉచిత సలహా ఇచ్చే దుస్థితికి దిగజారిన సంగతి తెలిసిందే. ఇలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉన్నత చదువులు చదివిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
కూలీనాలీ చేసుకోలేక.. చదువుకు తగిన ఉద్యోగం దొరుకక ఎంతో మంది విద్యావంతులు మానసికంగా నలిగిపోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రప్రభుత్వమే చెప్పింది. దేశంలో గ్రాడ్యుయేట్లలోనే అత్యధిక నిరుద్యోగులు ఉన్నారన్న వార్తలు వాస్తవమేనా? అని తమిళనాడు ఎంపీ రమేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సమాధానం ఇచ్చింది. ఇందులో అనేక విస్తుపోయే వాస్తవాలు ఉన్నాయి.