హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రైతును కొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టే పనులను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నది. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త అదానీకి మేలు చేసేలా కేంద్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకొన్నది. హర్యానాలో 2022-23 సీజన్ నుంచి గోధుమలను మండీలు, సాధారణ గోదాముల్లో కాకుండా అదానీకి చెందిన సైలో (గోదాములు) ల్లోనే నిల్వ ఉంచాలని స్థానిక అధికారులను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఆదేశించింది. దండ్, కౌల్, పెహోవా, పై, పుంద్రి, సోల్మజ్ర, గుమ్తాలా మండీల్లో రైతులకు అవసరమైన గోనె సంచులను సరఫరా చేయొద్దని స్పష్టంచేసింది. ఈ మండీల్లో కొనుగోలు చేసిన మొత్తం గోధుమలను నేరుగా సోల్మజ్రలోని అదానీ సైలోకు తరలించాలని సూచించింది. ఎఫ్సీఐ నిర్ణయంతో ఇటు తమకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు, మండీలు, సాధారణ గోదాముల నిర్వాహకులు ఆందోళనకు దిగారు. దీంతో ఎఫ్సీఐ తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకొన్నది. తెలంగాణలోనూ కేంద్రం ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తున్నది. యాసంగి ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీల కేటాయింపులో ఇబ్బంది పెడుతున్నది.