హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): గిరిజన చట్టాలకు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్‌లోని కుమ్రంభీం ఆదివాసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అటవీ హకుల చట్టాన్ని కేంద్రం గతేడాది సవరించి నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. గ్రామసభల అనుమతులు లేకుండానే ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో యథేచ్ఛగా మైనింగ్ చేసేలా కేంద్రం చట్ట సవరణ చేయటాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ తనకు 8 మంది అక్కాచెల్లెండ్లు ఉన్నారని, సీతక్క తొమ్మిదో సోదరి అని పేర్కొన్నారు. పలువురిని సన్మానించారు.
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. వివిధ కోర్సుల్లో సీట్ల పెంపుపై ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. కాలేజీలకు అనుబంధంగా ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వాలని జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి శుక్రవారం తీర్పు చెప్పారు. కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం, రద్దుకు ఉన్నత విద్యాశాఖ అనుమతి ఇవ్వకపోవడంపై 27 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించారు.