హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణపై మరోసారి వివక్షను చూపింది. మునుగోడులో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారంపై నిషేధం విధిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నది. ర్యాలీలు, మీటింగ్‌లతోపాటు కనీసం మీడియా, సోషల్ మీడియాలోనూ మాట్లాడకుండా నిషేధం విధించడం గమనార్హం. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్‌రెడ్డి ఓటర్లను బెదిరించేలా ప్రసంగించారని పేర్కొంటూ ఆయనపై 48 గంటలపాటు నిషేధం విధించింది. శనివారం రాత్రి 7 గంటల నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నది.
ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామంటూ మంత్రి ఓటర్లను బెదిరించారని పేర్కొంటూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 29వ తేదీలోపు వివరణ ఇవ్వాలంటూ మంత్రికి 28న ఈసీ నోటీస్ జారీచేసింది. ఈ నోటీసుకు మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 2.38 గంటలకు వివ రణను అందజేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. మంత్రి వివరణపై సంతృప్తి చెందలేదని పేర్కొంటూ సాయంత్రం 7.30 గంటలకు ఆయన ప్రచారంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. గంటల వ్యవధిలోనే ఇంత హడావిడిగా నిర్ణయం తీసుకోవడంపై టీఆర్ఎస్ శ్రేణులు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
ఈసీ నిర్ణయం ముమ్మాటికీ ఏకపక్ష నిర్ణయమేనని, తెలంగాణపై కక్ష సాధింపేనంటూ టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు చేస్తున్న ప్రయత్నమేనని అనుమానాలు వ్యక్తంచేశాయి. టీఆర్ఎస్ ఇచ్చే ఫిర్యాదులను పట్టించుకోని ఈసీ.. బీజేపీ నేతల ఫిర్యాదుపై మాత్రం ఆగమేఘాలపై స్పందిస్తున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో కీలక నేత, ఉప ఎన్నిక స్టార్ క్యాంపేయినర్‌గా ఉన్న జగదీశ్‌రెడ్డిని ప్రచారంలోంచి తప్పించాలని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసీని అడ్డుపెట్టుకొని చివరికి ఆయన ప్రచారంపై నిషేధం విధించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈసీ కేంద్రం చెప్పుచేతల్లో ఉన్నదంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారంపై ఈసీ నిషేధం విధించడం గమనార్హం.