హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఓటరు జాబితా సవరణ ప్రారంభమై జనవరి 6న తుది జాబితా ప్రకటనతో ముగియనుంది. ఆగస్టు 20 నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు ఓటరు జాబితా సవరణలో భాగంగా బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో)లు ఇంటింటికీ తిరిగి పేర్లను పరిశీలిస్తారు. అవసరమైతే పోలింగ్ స్టేషన్ల సర్దుబాటు, మార్పులు చేస్తారు. అధికారుల పరంగా చేయాల్సిన బాధ్యతలన్నింటినీ అక్టోబరు 28 కల్లా పూర్తి చేయనున్నారు. ముసాయిదా ఓటరు జాబితాను అక్టోబర్ 29న ప్రచురిస్తారు.
అక్టోబరు 29 నుంచి నవంబర్ 28 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. డిసెంబర్ 24లోగా దరఖాస్తులను పరిశీలిస్తారు. తుది ఓటరు జాబితాను 2025 జనవరి 6న ప్రచురిస్తారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఓటు హక్కు కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. కొత్త ఓటు, చిరునామా మార్చుకోవడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం, ఓటరు వివరాలు సవరించుకోవడానికి అవకాశాన్ని కల్పించారు.
13 వరకు దోస్త్ రిపోర్టింగ్ గడువు
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును అధికారులు 13 వరకు పొడగించారు. దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారు 13 వరకు ఆన్లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళల కోసం జాబ్ ఫెయిర్
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించిన జాబ్ ఫెయిర్‌లో 300 మందికిపైగా ఉద్యోగాలు పొందారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐకియా, రిలయన్స్, నిప్పన్‌లైఫ్ ఇన్సూరెన్స్, మెడ్‌ప్లస్, టాటా మెటార్స్, మ్యాక్స్, గోపిజ్జా, కేఎస్ బేకర్స్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్, వీహబ్ సంయుక్తంగా జూబ్లీహిల్స్‌లోని బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించాయి. 4వేల మంది మహిళలు హాజరయ్యారు.
జేపీసీలో ఇద్దరు తెలంగాణ ఎంపీలు
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): వక్ఫ్‌బోర్డు అధికారాల సవరణకు సంబంధించిన బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంట్ కమిటీ (జేపీసీ)లో ఇద్దరు తెలంగాణ ఎంపీలకు చోటు దక్కింది. మొత్తం 21 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ లోక్‌సభ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తెలంగాణ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చోటు దక్కింది.