హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అధ్వానంగా ఉన్నదని సగానికిపైగా దేశ ప్రజానీకం అభిప్రాయపడుతున్నది. కీలక శాఖలకు కేటాయించిన నిధులపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నది. వైద్యారోగ్యశాఖకు తగినన్ని నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. వైద్యారోగ్యశాఖను పటిష్ఠపరచడం ద్వారా కొవిడ్ మహమ్మారినుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశలు గల్లంతయ్యాయని పలువురు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రజల మనోగతాన్ని తెలుసుకొనేందుకు లోకల్ సర్కిల్ అనే సామాజిక మాధ్యమ వేదిక దేశవ్యాప్తంగా ఆన్లైన్ సర్వే నిర్వహించింది. మొత్తంగా 342 జిల్లాల నుంచి సుమారు 40 వేల మంది అభిప్రాయాలను సేకరించింది. అందులో 66% మంది పురుషులు, 34% మంది మహిళలున్నారు. ప్రథమశ్రేణి నగరాలనుంచి 42%, ద్వితీయశ్రేణి నగరాల నుంచి 33%, తృతీయశ్రేణి నగరాలనుంచి, గ్రామీణ జిల్లాల నుంచి 25% మంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. సర్వేలో పాల్గొన్న 56% మంది కేంద్ర బడ్జెట్‌పై పెదవివిరిచారు. 60% మంది బడ్జెట్‌తో ఏదో ఒక రంగానికి, లేదంటే ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఒనగూరేది లేదని కుండబద్దలు కొట్టారు.