న్యూఢిల్లీ, మే 12 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో రైతులు కోట్ల రూపాయల మేరకు నష్టపోయారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తడిసిన పంటనంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణలో అకాల వర్షాల వల్ల వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్రం బాధ్యతగా ముందుకొచ్చి రాష్ర్టాలకు సహాయం చేయాలని కోరారు. రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి నరేంద్రమోదీ సర్కారు అప్పనంగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్నదని మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ పథకం అమలు కోసం కేంద్రం నుంచి రూ.130 కోట్లు పొందిన రిలయన్స్ కంపెనీ మహారాష్ట్రలో రైతులకు కేవలం రూ.30 కోట్లు పరిహారాన్ని చెల్లించి చేతులు దులిపేసుకున్నదని తెలిపారు.
మహిళా రెజ్లర్లకు మద్దతుగా 18 నుంచి ఆందోళనలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసనకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు తెలుపుతున్నట్టు వెంకట్ ప్రకటించారు. సీఐటీయూ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డీఎఫ్ఐ అనుబంధ సంస్థలతో కలిసి ఈ నెల 18 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.