Telangana | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విషయంలో కేంద్రం పూర్తి వివక్షతో ఏక పక్షంగా వ్యవహరిస్తున్నది. విద్యుత్తు బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నది. విభజన తర్వాత తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తిన విద్యుత్తు బకాయిల చెల్లింపు వివాదంలో ఇప్పటికే న్యాయస్థానం జోక్యం చేసుకున్నప్పటికీ కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నట్టు మంగళవారం రాజ్యసభలో కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కేసింగ్ చేసిన ప్రకటనతో స్పష్టమైంది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలపై పలువురు సభ్యులు అడిగిన ఆర్కేసింగ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ చెల్లించాల్సిన సుమారు రూ. 6 వేల కోట్ల బకాయిలను రిజర్వ్ బ్యాంకు ద్వారా జమ చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఏపీతో..ఏకపక్షంగా..
తెలంగాణ తమకు రూ. 6,756 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్రానికి ఏపీ 2022 ఆగస్టులో ఫిర్యాదు చేసింది. అయితే తెలంగాణకు చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలపై మాత్రం దృష్టి సారించలేదు. అసలు ఆ విషయాన్నే పట్టించుకోకుండా 30 రోజుల్లోగా విద్యుత్తు బకాయిలను ఏపీకి చెల్లించాలంటూ తెలంగాణకు కేంద్రం లేఖ రాసింది. దీనిపై తెలంగాణ విద్యుత్తు సంస్థలు హైకోర్టుకు వెళ్లాయి.
విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణపై ఒత్తిడి చేయొద్దొంటూ హైకోర్టు కేంద్రానికి, ఏపీలకు నోటీసులు జారీచేసింది. రూ. 6,756 కోట్లు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. నిజానికి ఏపీ నుంచి తెలంగాణకు రూ. 12,940 కోట్ల విద్యుత్తు బకాయిలు (31.12.2021 నాటికి) రావాల్సి ఉంది. కేంద్రం మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు బకాయిలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్తు బకాయిల రూపంలో మొత్తం రూ. 17,828 కోట్లు రావాల్సి ఉంది. అందులో నుంచి తెలంగాణ నుంచి ఏపీకి ఇవ్వాల్సిన బకాయిలు రూ. 4,887 కోట్లు మినహాయిస్తే.. ఏపీ నుంచే తెలంగాణకు రావాల్సిన బకాయిలు రూ. 12,940 కోట్లు ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం మాత్ర ఏకపక్షంగా వ్యవహరిస్తూ 30 రోజుల్లో డబ్బులు చెల్లించండంటూ లేఖలు రాస్తున్నది.