హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు మన జీవితంలో ప్రాథమిక అవసరంగా మారింది. విద్య, వైద్యం, రవాణా, వంట, వ్యవసాయం, పరిశ్రమలు, వినోదం.. ఇలా అన్ని రంగాలూ విద్యుత్తుతో ముడిపడి ఉన్నవే. దేశంతోపాటు రాష్ర్టాలు పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నిరంతరం విద్యుత్తు అందుబాటులో ఉండటం ఎంతో కీలకం. ఇంతటి విస్తృత ప్రాధాన్యమున్న విద్యుత్తు రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. దీనిలో భాగంగా విద్యుత్తు చట్ట సవరణ బిల్లును తీసుకొస్తున్నది. ఈ ముసాయిదా బిల్లులోని సెక్షన్ 2, క్లాజ్ 17 ప్రకారం.. డిస్కంల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకించి లాభదాయకమైన ప్రాంతాల్లో విద్యుత్తు పంపిణీ వ్యవస్థలను ఫ్రాంచైజీలకు, సబ్ లైసెన్సీలకు అప్పగిస్తారు. అదే జరిగితే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు లభించదు. ఇతర వినియోగదారులతోపాటు డిస్కంలకూ తీవ్ర నష్టం జరుగుతుంది.
క్రాస్ సబ్సిడీలు రద్దు
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లులోని సెక్షన్ 42 ప్రకారం.. ఇకపై క్రాస్ సబ్సిడీలు ఉండవు. ఎలాంటి వినియోగదారునికైనా ఒకే ధరకు విద్యుత్తును అమ్మాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతితో రైతులకు ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు వివిధ శ్లాబుల ద్వారా గృహ, పారిశ్రామిక వినియోగదారులకు సబ్సిడీలు అందిస్తున్నారు. ఆర్థికంగా పరిపుష్ఠంగా ఉన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇతర శ్లాబుల్లో ఉన్న వినియోగదారులకు మళ్లించి తక్కువ ధరకు విద్యుత్తు అందిస్తున్నారు. దీనినే క్రాస్ సబ్సిడీ అంటారు.
డిస్కంలకు ఉరే
విద్యుత్తు సవరణ బిల్లులోని సెక్షన్ 3లో పేర్కొన్న అంశాలు డిస్కంలకు నిలువునా ఉరివేసేవిగా ఉన్నాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రతి డిస్కం ఏటా సరఫరా చేసే మొత్తం విద్యుత్తులో కొంత పునరుత్పాదక ఇంధనం (రెన్యువబుల్ ఎనర్జీ) ఉండాలి. అది ఎంతన్నది కేంద్ర సంస్థలే నిర్ణయిస్తాయి. దీనితో స్థానికంగా ఉన్న హైడల్, థర్మల్ ప్రాజెక్టులను మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ కేంద్రం నిర్ణయించినంతమేర రెన్యువబుల్ ఎనర్జీని సరఫరా చేయకపోతే డిస్కంలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏటేటా రెట్టింపై డిస్కంలు కుదేలవుతాయి.
విద్యుత్తు బిల్లుకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ
నరేంద్రమోదీ సర్కార్ నిరంకుశంగా తీసుకొస్తున్న విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నవంబర్ 23న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యుత్తు ఇంజినీర్లతో ఆ రోజు ఢిల్లీలో భారీ ర్యాలీ, మహాధర్నా చేపట్టనున్నట్టు ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్రదూబే, సెక్రటరీ జనరల్ రత్నాకర్‌రావు వెల్లడించారు. ఆదివారం శ్రీనగర్‌లో జరిగిన ఏఐపీఈఎఫ్ ఫెడరల్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. విద్యుత్తు సవరణ బిల్లును మొండిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని కేంద్రాన్ని హెచ్చరించారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ డిస్కంలు నిర్వీర్యమవుతాయని, విద్యుత్తు పంపిణీ వ్యవస్థలు ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశానికి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ర్టాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున రత్నాకర్రావుతోపాటు సదానందం, శ్రీనాథ్‌రెడ్డి, గోపాల్‌రావు, వెంకటేశ్వర్లు, కిరణ్, వెంకటేశ్, అంజయ్య, వెంకటనారాయణరెడ్డి, వరప్రసాద్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.