ఆదిలాబాద్, మే 16(నమస్తే తెలంగాణ) : 2026-27 సీజన్‌కు సంబంధించి మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.63 లక్షల మంది రైతులు ఉండగా.. వానకాలంలో పత్తి, సోయా, కంది, మక్క పండిస్తారు. యాసంగిలో జొన్న, శనగ, మక్క సాగు చేస్తారు. వానకాలంలో 5.31 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంటుంది. ఎక్కువగా నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి వేస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 35 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పత్తి కనీస మద్దతు ధరను కేంద్రం రూ.8667గా ప్రకటించగా.. గతేడాదితో పోలిస్తే రూ.557 పెరిగింది. సోయాబిన్ ధర క్వింటాలుకు రూ.5708 ప్రకటించగా.. గతేడాదితో పోల్చితే రూ.380 పెరిగింది. కంది మద్దతు ధరను కేంద్రం ప్రభుత్వం క్వింటాలుకు రూ.8450 ప్రకటించగా.. గతేడాది కంటే రూ.450 పెరిగింది. జొన్న పంట క్వింటాలుకు రూ.4073 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం జొన్న క్వింటాలుకు రూ.3669 ఉండగా రూ.324 పెరిగింది. రెండు సీజన్లలో రైతులు సాగు చేసే మక్క పంట ధరను కేంద్రం కేవలం రూ.10 మాత్రమే పెంచింది. ప్రస్తుతం మక్కల మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ఉండగా.. రూ. 2410 పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటిస్తున్న మద్దతు ధరలు రైతులకు దక్కడం లేదు. పంట కొనుగోళ్లలో పలు నిబంధనల కారణంగా మద్దతు ధర రాక రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువ పండించే పత్తి పంటను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని 11 కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు. వానకాలంలో సాగు చేసే ఈ పంట కొనుగోళ్లు అక్టోబరు చివరి వారంలో ప్రారంభమవుతాయి. కొనుగోళ్లలో సీసీఐ పలు నిబంధనలు విధిస్తున్నది. తేమ శాతం 8 నుంచి 12 వరకు, దూది పింజ పొడవు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉండాలని సూచిస్తుంది. ఎకరానికి కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసే నిబంధన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గతేడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అక్టోబరు చివరివారం, నవంబరులో తీసిన పత్తి చలి కారణంగా తేమ శాతం ఎక్కువగా ఉండడంతో సీసీఐ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నది. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నారు. కొనుగోళ్లు ప్రారంభమైన నెల రోజుల తర్వాత దూదిపింజ పొడువు సరిగా లేదంటూ క్వింటాలుకు రూ.100 తగ్గించి కొనుగోలు చేస్తారు. ఫలితంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదు.
గతేడాది జిల్లాలో రైతులు వానకాలంలో పండించిన సోయా కొనుగోళ్లును ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ద్వారా పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయగా.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నాఫెడ్ గోదాముల్లో పంట నాణ్యత లేదంటూ అధికారులు నిల్వ చేసుకొనేందుకు నిరాకరించారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన సోయాను నాఫెడ్ అధికారులు తిప్పి పంపగా.. రైతులు ప్రైవేటులో విక్రయించి నష్టపోయారు. శెనగల అమ్మకాల్లో ఇబ్బందులు పడ్డారు. పంట కొనుగోళ్లను సగంలో నిలిపివేయడంతో రైతులు ప్రైవేటులో అమ్ముకున్నారు. ప్రస్తుతం జొన్న కొనుగోళ్లు జరుగుతుండగా.. పంట అమ్మకానికి రైతులు మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాయాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పేరిట జల్లెడ పట్టడం, ఎండపెట్టాలని సిబ్బంది సూచిస్తుండడంతో రైతులు ఖర్చు తడిసిమోపడవుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిబంధనలు లేకుండా మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటిస్తున్న మద్దతు ధరలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పంటల మద్దతు ధర ప్రకటనలో ఎలాంటి శాస్త్రీయత లేదు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడం లేదు. ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. రైతులు పండించిన పంటల కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం ప్రణాళికలు అమలు చేయడం లేదు. జిల్లాలో ఎక్కువగా సాగయ్యే పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనల కారణంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదు. పంట సేకరణలో పరిమితుల కారణంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. సీసీఐ కార్పొరేట్ కంపెనీలా వ్యవహరిస్తూ పత్తి పంటను మద్దతు ధర కంటే తక్కువకు సేకరిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ ప్రణాళికలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి.
– బండి దత్తాత్రి, తెలంగాణ రైతు సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు