మోటకొండూర్, మే 16: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ మోటకొండూర్ విద్యుత్ సబ్స్టేషన్ అసిస్టెంట్ లైన్మెన్ (ఏఎల్ఎం) పప్పుల రమేశ్ శనివారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం మేడికుంటపల్లికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ బోరుబావులకు కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఏఎల్ఎం రమేశ్ రూ.35 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధిత రైతు నివాసానికి సమీపంలో ఏఎల్ఎం రమేశ్ సదరు రైతు నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదుచేసి, హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచనున్నట్టు అధికారులు వెల్లడించారు.