లక్నో: ఒక మహిళకు ఐదు రోజుల వ్యవధిలో రెండు కాన్పులు జరిగాయి. నలుగురు శిశువులకు ఆమె జన్మనిచ్చింది. ఇవి అరుదైన నార్మల్ డెలివరీలని ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆ మహిళకు పుట్టిన ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. (four deliveries in 5 days) ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. సంభాల్ జిల్లా ఓవరి గ్రామానికి చెందిన 31 ఏళ్ల అమీనా గర్భం దాల్చినప్పుడు ఆమె కడుపులో నాలుగు పిండాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. కాన్పు సమయంలో ఇబ్బందుల దృష్ట్యా పిండాల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. అయితే నాలుగు పిండాలను ఉంచుకోవాలని ఆ మహిళ, ఆమె కుటుంబం నిర్ణయించింది.
కాగా, మొరాదాబాద్ లోధిపూర్ ప్రాంతంలోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులు అమీనా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. గర్భం దాల్చిన మూడో నెల నుంచి కాన్పు వరకు డాక్టర్ శుభ్రా అగర్వాల్ నేతృత్వంలోని ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షించారు.
మరోవైపు మే 8న అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మే 9న తొలుత మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. మొదటి శిశువు 710 గ్రాముల బరువుతో పుట్టడం, ఆమె గర్భం ఆరున్నర నుంచి ఏడు నెలల దశలో ఉండటంతో మిగిలిన ప్రసవాలను వైద్యులు వాయిదా వేశారు. ఐదు రోజుల తర్వాత అమీనాకు మరోసారి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈసారి ముగ్గురు శిశువులకు ఆమె జన్మనిచ్చింది. ఒక మగ, ఇద్దరు ఆడ బిడ్డలు పుట్టారు.
అయితే అమీనా నాలుగు ప్రసవాలు అధిక ప్రమాదంతో కూడుకున్నవని డాక్టర్ శుభ్రా అగర్వాల్ తెలిపారు. తమ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం ద్వారా నలుగురు శిశువులు జన్మించడం ఇదే మొదటి కేసు అని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా నవజాత శిశువులను వెంటిలేటర్‌పై ఉంచినట్లు వివరించారు. తల్లి, నలుగురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.
కాగా, గర్భధారణ సమయంలో రక్తపోటు, కాలేయ సంబంధిత సమస్యలతో అమీనా బాధపడినట్లు డాక్టర్ శుభ్రా అగర్వాల్ తెలిపారు. దీంతో చికిత్స, పర్యవేక్షణ కోసం ఆమెను పలుమార్లు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని చెప్పారు.
మరోవైపు నలుగురు శిశువుల తండ్రి, కిరాణా షాపు యజమాని, అమీనా భర్త అయిన మహమ్మద్ అలీమ్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అమీనా గర్భధారణ నుంచి ప్రసవాల వరకు వైద్యుల బృందం అందించిన సంరక్షణ, సహాయాన్ని ఆమె సోదరి ఇమ్రానా పర్వీన్ కూడా ప్రశంసించారు.