గోదావరిఖని, మే 28: సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రాంమూర్తి డిమాండ్చేశారు. రామగుండం డివిజన్లో బొగ్గు ఉత్పత్తిలో సింహభాగం ఓసీపీ 5వ గనిదేనని, అలాంటిది బొగ్గురవాణా ఎందుకు జరుగడం లేదని ప్రశ్నించారు. తమ పరిశీలనలో రామగుండంలో బొగ్గు నిల్వలు లేవని తెలుస్తున్నదని తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని బొగ్గు నిల్వలను టీబీజీకేఎస్ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం ప్రకటించిన విధంగా రామగుండం డివిజన్లో బొగ్గు నిల్వలు లేవని, కోల్ డంప్ యార్డ్ ఖాళీగా కనబడుతున్నదని తెలిపారు. ఓసీపీ 5వ గనిలో మూడున్నర లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని యాజమాన్యం చెప్పిందని, వాటిని సందర్శించడానికి మాత్రం తమ బృందాన్ని అనుమతించలేదని మండిపడ్డారు. దీంతో పలు అనుమానాలు ఉన్నాయని, వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలాడి శ్రీనివాసరావు, ఆర్ జీవన్, ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్, తదితరులు ఉన్నారు.