హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఏ చిన్న ఘటన జరిగినా మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ నాయకులు సికింద్రాబాద్‌లో సోమవారం జరిగిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం కేసులో నోరు మెదపకపోవడంపై సోషల్‌మీడియాలో చర్చకు దారితీసింది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఘటనాస్థలికి వెళ్లలేదు సరికదా.. అంగతకుడు ఎవరు? కుట్ర ఉందా? స్థానిక పోలీసుల వైఫల్యం ఉందా? అనే విషయాలపై ఆరా తీయలేదు.
స్పోకెన్ ఇంగ్లిష్ తరగతుల పేరుతో ‘ప్రత్యేక’ తరగతులు జరుగుతున్నాయని, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చినవారు ఉంటున్నారని స్థానికులు మొత్తుకుంటున్నా.. కేంద్ర మంత్రులుగా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘దోస్తీ పాలిటిక్స్‌లో హిందుత్వ సిద్ధాంతానికి బీజేపీ ఎంపీలు పాతర వేస్తున్నారని సోషల్‌మీడియాలో పోస్టులు వెలిశాయి.
హైదరాబాద్‌లో మతపరమైన విషయంలో ఆందోళనలపై కేంద్ర హోం సహాయ మంత్రి సోయి లేకుండా వ్యవహారిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. నాడు ప్రతిదీ రాష్ట్ర సమస్య… నేడేమో జాతీయ సమస్యగా డైవర్షన్ పాలిటిక్స్.. నాడు రాజీనామా డిమాండ్‌తో రంకెలు.. నేడు సన్నాయి నొక్కులు.. శపథాలు శివాలు ఎటువాయే? అంటూ బీజేపీ నాయకులపై ప్రశ్నలవర్షం కురిపించారు.
అప్పుడు రక్తాలు ఉడికిపోయాయి, అధికారి మార్పిడితో చల్లబడ్డాయా.! వ్యక్తిగత లబ్ధి రాజకీయాల్లో సిద్దాంతాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేశారా? ఎన్నికలప్పుడే హిందుత్వంపై పౌరుషం, పొడుచుకు వస్తుందా? ప్రజలు అన్ని గమనిస్తున్నారనే విషయాన్ని మరుస్తున్నారా? అంటూ ఘాటుగా బీజేపీ నాయకుల వైఖరిపై మండిపడ్డారు.