హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పురపోరు తుది దశకు చేరింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనున్నది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మున్సిపాలిటీల తొలి ఫలితం 10 గంటల్లోపే వచ్చే అవకాశం ఉన్నది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యమవుతాయని ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 136 ఓట్ల లెకింపు కేంద్రాలను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం బీఎన్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యానాయక్ తెలిపారు.
ఓట్ల లెకింపు పారదర్శకంగా జరుగడానికి ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఎస్ఈసీ కార్యదర్శి లింగ్యానాయక్ తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెకింపును చేపడుతారు. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. ఒకో వార్డు బ్యాలెట్ బాక్సులను వరుసగా లెకింపు టేబుళ్ల వద్దకు చేరుస్తారు. ప్రతి పోలింగ్‌స్టేషన్ బ్యాలెట్లనూ 25 చొప్పున కట్టలుగా కడతారు. వార్డులోని అన్ని పోలింగ్స్టేషన్ల బ్యాలెట్ కట్టలను ఒక డ్రమ్‌లో వేసి క్షుణ్ణంగా కలుపుతారు. ఆ తర్వాతే వివరణాత్మక లెకింపు మొదలవుతుంది. ప్రతి రౌండ్లో డ్రమ్ నుంచి 1,000 బ్యాలెట్ పేపర్లను (40 కట్టలు) తీసి లెకింపు టేబుళ్లకు పంపిస్తారు.
చెక ట్రేలలో అభ్యర్థుల వారీగా, నోటా, సందేహాస్పద ఓట్లను వేరు చేస్తారు. ప్రతి బ్యాలెట్‌ను అభ్యర్థుల ఏజెంట్లకు చూపిన తర్వాతే లెకిస్తారు. 100 ఓట్లు పూర్తికాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగిసిన వెంటనే అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లు, తిరసరించిన ఓట్ల వివరాలను రిజల్ట్ షీట్లో నమోదు చేసి, ఏజెంట్ల సంతకాలు తీసుకొంటారు. వార్డులోని అన్ని ఓట్ల లెకింపు పూర్తయి, రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించిన తర్వాత అధికారికంగా ఫలితాలను ప్రకటించి, విజేతలకు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి కేవలం లెకింపు పర్యవేక్షకులు, సహాయకులు, అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. చెల్లుబాటయ్యే పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కౌంటింగ్ హాల్లోకి తీసుకురావడంపై నిషేధం విధించారు. పారదర్శకత కోసం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద, కౌంటింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.
