హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సుదర్శన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు కాంగ్రెస్ అధిష్ఠానంపై రగిలిపోతున్నారు. ఒకవైపు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుజ్జగించినా.. ప్రయోజ నం కనిపించడం లేదు. నేతలు రాజీనామాల పట్టువీడటం లేదు. ఒకవైపు, కీలక నేతలు ఆగ్రహంతో ఊగిపోతుంటే.. వారి అనుచరు లు మరింత రెచ్చిపోతున్నారు. ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వంపై, అటు అధిష్ఠానంపై మం డిపడుతున్నారు. తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేస్తున్నా రు. పార్టీ కోసం కష్టపడ్డ తమ నేతకు మంత్రి పదవి దక్కనప్పుడు ఇక పార్టీతో తమకేం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. పార్టీ తమ సేవలను గుర్తించనప్పుడు… పార్టీకి తామెందుకు విదేయంగా ఉండాలని రగిలిపోతున్నారు.
ఏడాదిన్నర తర్వాత ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. ఇందు లో వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి దక్కగా, ముందునుంచీ పోటీలో ఉన్న సుదర్శన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్‌రెడ్డికి అధిష్ఠానం మొండిచేయి చూపించింది. మంత్రి పదవి దక్కనందుకు నిరసనగా తాము పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీచేశా రు. దాదాపు రాజీనామా చేసినంత పనిచేశా రు. అధిష్ఠానం హామీతో కొంత వేచి చూసే ధోరణిలోకి వెళ్లారు. కానీ, వారి అనుచరులు మాత్రం తగ్గడం లేదు. తమ నేతకు జరిగిన అన్యాయానికి నిరసనగా పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వర్గీయులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లేఖ రాశారు.
తమ నేతకు అన్యా యం చేసిన కాంగ్రెస్‌కు ఈ గడ్డపై పుట్టగతులు ఉండవని తీవ్రస్థాయిలో శాపనార్థాలు పెట్టా రు. అంతటితో ఆగకుండా బోధన్ బంద్‌కు పిలుపునిచ్చి, అనివార్య కారణాలతో దానిని వాయిదా వేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కనందుకు నిరసనగా చండూరు మండల నేతలు పార్టీకి, పదవులకు మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే దారిలో ప్రేమ్‌సాగర్‌రావు, మల్రెడ్డి రంగారెడ్డి అనుచరులు కూడా వెళ్తున్నట్టు తెలిసింది. అనుచరులను రాజీనామాలకు పురికొల్పడం ద్వారా అధిష్ఠానంపై మరింత ఒత్తిడి పెంచొచ్చనే ఆలోచనలో భంగపాటు నేతలు ఉన్నట్టు సమాచారం. అందుకే ముం దుగా అనుచరులతో రాజీనామాలు చేయించి, అప్పటికీ, అధిష్ఠానం నుంచి భరోసా దక్కకపోతే ఇక స్వయంగా తామే రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ విధంగా మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్‌లో మరో కొత్త కుంపటికి దారి తీసిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది.
తుర్కయంజాల్, జూన్ 9: మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుజ్జగించేందుకు ప్రయత్నించేరు. సోమవారం ఆయన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అని, పదేండ్లపాటు అధికారంలో లేకపోయినా పార్టీని కాపాడారని, ఆయన ఆవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు ఇతర పార్టీ పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి మాట్లాడారని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహానికి గురికాకూడదని సూచించారు.
కాంగ్రెస్ భూస్థాపితమే.. మూకుమ్మడి రాజీనామాలు చేసిన బోధన్ కాంగ్రెస్ నేతలు
బోధన్, జూన్ 9: మంత్రివర్గ విస్తరణ లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి చోటు దక్కకపోవడంతో ఆగ్రహించిన అనుచరు లు పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. వారంతా సోమవారం రాజీనామా పత్రాలతో హైదరాబాద్‌లోని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇంటికి తరలివెళ్లారు. మహేశ్‌కుమార్ అప్పటికే ఢిల్లీకి వెళ్లడంతో రాజీనామా పత్రాలను ఆ ఇంటి వాచ్‌మన్ కు ఇచ్చారు. ట్విట్టర్, వాట్సాప్ ద్వారా మ హేశ్కుమార్గౌడ్కు రాజీనామా లేఖలను పోస్ట్‌చేశారు. అంతేకాకుండా రాజీనామా లేఖలను ట్విట్టర్, వాట్సాప్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, అధిష్ఠానం పెద్దలకు పంపారు. మ రికొందరు నాయకులు పీసీసీ చీఫ్‌కు ఫోన్‌చేసి అసంతృప్తి వెళ్లగక్కారు.
జిల్లాలో కాం గ్రెస్‌కు గట్టి నాయకుడిగా ఉన్న సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే జిల్లాలో పార్టీని ఆదుకునే నాథుడే ఉండరని స్పష్టంచేశారు. స్థానిక ఎన్నికలు జరిగేలోపు సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని అల్టిమేటమ్ ఇచ్చా రు. రాజీనామా చేసినవారిలో మండలాల అధ్యక్షులు గంగాశంకర్, పాషా మొయినుద్దీన్, మోబిన్‌ఖాన్, శ్రీనివాస్‌గౌడ్, డీ నాగేశ్వర్రావు, మందర్న రవి, పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శంకర్, బోధన్ శివాలయం చైర్మన్ హరికాంత్‌చారి ఉన్నారు.