కోస్గి, ఏప్రిల్ 17 : సీఎం ఇలాకా నారాయణపేట జిల్లా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. ముందస్తు సమాచారంలేకుండా శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆఫీసుల కూల్చివేతలు మొదలుపెట్టారు. రెండేండ్ల కిందట సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో లైబ్రరీని అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించామని గొప్పలు చెప్పిన నేతలు ఇప్పుడు వాటినే కూల్చేస్తున్నారు. కనీసం లైబ్రరీలో ఉన్న సామగ్రిని తొలిగించకుండా ఓ మూలన కప్పేసి కూల్చివేతలు మొదలుపెట్టారు. కోస్గి-దౌల్తాబాద్ రహదారి విస్తరణ పనుల్లో చిరు వ్యాపారులు రోడ్డునపడ్డారు.
తమకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఇదే విషయమై ‘నమస్తే తెలంగాణ’ మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించగా ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం గమనార్హం. ప్రజాధనం వృథా చేయడంపై బీఆర్ఎస్ కోస్గి ఇన్చార్జి వెంకట నర్సింహులు, కోనేరు సాయప్ప, బెజ్జు నర్సింహులు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పాలన అంతా బుల్డోజర్లతోనే కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.