పెబ్బేరు/వాజేడు/ భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): గుంతలమయమైన రహదారులను వెంటనే మరమ్మతు గులాబీ దళం నినదించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు వారంరోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రహదారుల వద్దకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లి సెల్ఫీలు దిగి నిరసన గళం వినిపిస్తున్నారు. సోమవారం మణుగూరులో రేగా కాంతారావు మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రహదారులకు ఒక్క రూపాయి నిధులు విడుదల కాలేదని విమర్శించారు. జిల్లాకు వచ్చే రూ.200 కోట్ల నిధులు ఎక్కడికి పోతున్నాయో చెప్పాల ని నిలదీశారు.
ములకలపల్లి మండల కేంద్రంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి బీటీపీఎస్ గేటు ఎదుట ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు జీపీలోని అరుణాచలపురం శివారులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వాజేడు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వరకు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఎస్సై జక్కుల సతీశ్ ఆధ్వర్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిన రోడ్డు వెడల్పు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, కరెంట్ పోల్స్ షిఫ్టింగ్ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రోడ్డు వెడల్పులో ఆస్తులు కోల్పోయిన బాధితులకు స్థలాలు కేటాయించి ఇండ్లు మంజూరు చేయాలని, పూర్తి చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.