హైదరాబాద్, ఏప్రిల్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): జగిత్యాలలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షమందికిపైగా ప్రజలు పోటెత్తారు. మినీ స్టేడియం నిండిపోవడంతో అంతకు రెట్టింపు సంఖ్యలో బయటే ఉండిపోయారు. సభకు హాజరుకాలేని లక్షలాది మంది టీవీలు, డిజిటల్, సోషల్‌మీడియా వేదికల ద్వారా కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారు. పల్లె, పట్టణం అని తేడా లేకుండా సోమవారం సాయంత్రం ప్రతి ఇంట్లో కేసీఆర్ ప్రసంగం మార్మోగింది. తెలంగాణలోని ప్రధాన మీడియా చానళ్లలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని వార్తా చానల్స్ కూడా కేసీఆర్ ప్రసంగాన్ని టీవీల్లో లైవ్‌లో ప్రసారం చేశాయి. గడిచిన రెండున్నరేండ్లలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన అరాచకాలను కేసీఆర్ బట్టబయలు చేసిన విధానాన్ని అర్థం చేసుకొన్న ప్రజలు.. నిజమేనంటూ మాట్లాడుకోవడం కనిపించింది.
తెలుగులోని ప్రధాన న్యూస్ చానల్స్ టీవీల్లోనే కాకుండా యూట్యూబ్‌లోని తమ అఫీషియల్ అకౌంట్ల ద్వారా కూడా కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశాయి. సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఎఫ్బీ ఖాతాల నుంచి కూడా ఈ స్ట్రీమింగ్‌ను కొనసాగించాయి. ‘టీ న్యూస్’ సహా దాదాపు అన్ని ప్రధాన న్యూస్ చానల్స్ కేసీఆర్ ప్రసంగాన్ని తమ యూట్యూబ్ వేదికల్లో లైవ్ స్ట్రీమింగ్కు పెట్టాయి. ఆయా చానల్స్ అన్నీ కలిపి రియల్ టైమ్ వ్యూస్ రెండు లక్షలు దాటింది. ఇవే చానల్స్‌కు చెందిన ఎఫ్బీ, ఎక్స్ ఖాతాల్లో మరో లక్ష వరకూ రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. ఇలా మొత్తంగా దాదాపు 50 నిమిషాలపాటు సాగిన కేసీఆర్ ప్రసంగానికి డిజిటల్, సోషల్‌మీడియా ఖాతాల్లోని అన్ని అకౌంట్లలో కలిపి కనీసం 5 లక్షల వరకు రియల్‌టైమ్ వ్యూయర్ షిప్ ఉండొచ్చని భావిస్తున్నారు.
కేసీఆర్ ప్రసంగాన్ని వినాలని యావత్తు తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా యువత పెద్దఎత్తున ఆసక్తి కనబర్చారు. దీంతో వ్యూస్ కోసం కొన్ని న్యూస్ చానల్స్ యూట్యూబ్ వంటి డిజిటల్ మీడియా వేదికల్లో వేర్వేరు థంబ్‌నెయిల్స్ పెట్టి కేసీఆర్ ప్రసంగాన్ని మల్టిపుల్ స్ట్రీమింగ్స్కు పెట్టడం కనిపించింది. అయినప్పటికీ, ప్రతి స్ట్రీమింగ్కు కనీసం 15 వేల నుంచి 20 వేల మంది రియల్‌టైమ్ వ్యూయర్స్ రావడం విశేషం. బీఆర్ఎస్ సభ బ్రహ్మాండమైన విజయం సాధించడంపై ఆ పార్టీ కార్యకర్తలే కాకుండా కేసీఆర్ అభిమానులు, నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకొన్నారు. కేసీఆర్ ప్రసంగం తమను ఎంతగానో ఆకట్టుకొన్నదంటూ పోస్టులు పెట్టారు.
కేసీఆర్ సభకు పోటీగా రేవంత్ సర్కార్ కాటారంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆదరణ కరువైంది. సభాస్థలికి ప్రజలను బలవంతంగా తరలించడానికి కాంగ్రెస్ శ్రేణులు ఆపసోపాలు పడ్డారు. కేసీఆర్ ప్రసంగ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం కూడా మొదలైంది. అయితే, కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి కనబర్చిన తెలంగాణ ప్రజలు.. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పే విషయాలపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. దీన్ని రుజువు చేస్తూ యూట్యూబ్, ఎఫ్బీ, ఎక్స్ మాధ్యమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగానికి సంబంధించిన రియల్ టైమ్ వ్యూస్ తక్కువగా రికార్డు కావడం గమనార్హం.