హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వేదికగా పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, వారి హకులకు భంగం కలిగించడం, మహిళా ఎమ్మెల్యేల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తదితర ఘటనలపై శుక్రవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహటర్తోపాటు జాతీయ మానవ హకుల కమిషన్ సభ్యురాలు విజయ భారతిని బీఆర్ఎస్ బృందం కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్ బృందం ఆందోళన వ్యక్తంచేసింది. కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గ పాలనపై ప్రజల తరఫున పోరాడాల్సిన తాము, తమను తాము కాపాడుకోవడానికి, సమస్యలను పరిషరించుకోవడానికి పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ అంశంపై రాజకీయాలతో సంబంధం లేకుండా తక్షణమే డీజీపీ నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకుంటామని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన పరిణామాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని, బాధ్యులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన భద్రత కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన ఆనంతరం మీడియాతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టకముందే నల్లదుస్తులు ధరించారనే సాకుతో పోలీసులు అడ్డుకున్నారని, తమ దుస్తులపై ఎలాంటి అభ్యంతరకర రాతలు లేవని స్పష్టం చేశారు.
‘మేము మంత్రులుగా పనిచేశాం.. 20-30 ఏండ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నాం.. ఉద్యమంలో ప్రాణాలను లెకచేయకుండా పోరాడాం, అలాంటి మమ్మల్ని అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?’అని సబితారెడ్డి నిలదీశారు. తన గొంతు నులిమారని, మహిళా ఎమ్మెల్యేల చీరలు, జుట్టు పట్టుకుని లాగి, తోటి ఎమ్మెల్యేలను కింద పడేసి తొకారని ఆరోపించారు. అసెంబ్లీ వంటి పవిత్ర ప్రాంగణంలో మహిళలుగా తమకు తీవ్ర అవమానం జరిగిందని, శాసనసభ్యులుగా హకులకు భంగం కలిగిందని వాపోయారు. దాడి జరిగి 100 గంటలు దాటినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోగా, తిరిగి తమపైనే అక్రమ కేసులు బనాయించడం రాజకీయ నాటకమని, రాష్ట్రంలో న్యాయం జరుగదనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
శాసనసభ్యులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును జాతీయస్థాయి కమిషన్లకు పూసగుచ్చినట్టు వివరించామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి రాజకీయంగా నిలదొకుకున్న తాము ప్రజా సమస్యలపై గళమెత్తాల్సింది పోయి, తమపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేయాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై తమ గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకే అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయించి తిరిగి ఉల్టా కేసులు నమోదు చేయడమే కాకుండా, జరిగిన అవమానంపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా స్పీకర్ ఇవ్వలేదని, ఒకవేళ ఆయన స్పందించి ఉంటే చేతులెత్తి నమసరించేవాళ్లమని అన్నారు.
అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న అప్రజాస్వామిక ఘటనలను రాష్ట్ర ప్రజలతోపాటు దేశమంతా చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను సభకు రాకుండా పథకం ప్రకారమే అడ్డుకున్నారని, మహిళా ప్రతినిధులపై దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలపై భౌతికదాడులకు పాల్పడటమే కాక, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిపై దాడికి పెద్ద సంఖ్యలో వ్యక్తులను ఉసిగొల్పి పంపించి, అసెంబ్లీని వాయిదా వేసి మరీ వారికి ఎసార్ట్ కల్పించారని, కేసీఆర్ నివాసం వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం అరెస్టు చేశారని ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడానికి పురుష పోలీసులను, పురుష ఎమ్మెల్యేలను అడ్డుకోవడానికి మహిళా పోలీసులను ప్రయోగించడం కాంగ్రెస్ ‘శిఖండి’ రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు.
తెలంగాణలో నాలుగు రోజులుగా హై డ్రామా సాగుతున్నదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అన్నీ అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం పైకి చెప్తున్నా, అసెంబ్లీని కొద్దిరోజులకే పరిమితం చేసి ప్రతిపక్షాన్ని సభకు రాకుండా చేశారని మండిపడ్డారు. భూ కుంభకోణాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ప్రభుత్వ వైఫల్యాలు తదితర అంశాలపై బీఆర్ఎస్ ఎకడ నిలదీస్తుందోనన్న భయంతోనే సమాధానం చెప్పలేక కుట్రపూరితంగా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు.
తెలంగాణ పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం స్పందించాలని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి లేఖలు రాసినట్టు వెల్లడించారు. రేవంత్‌రెడ్డి దాష్టీకాలను రాహుల్‌గాంధీ కట్టడి చేస్తారా? లేదా?అని నిలదీశారు. ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం, మహిళా నేతలపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ప్రజల తరఫున ప్రశ్నించే హకును ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు.
నిరసనల్లో సహజంగా జరిగే తోపులాటలను లైంగిక వేధింపులుగా చిత్రీకరించి మహిళా కానిస్టేబుల్‌తో తప్పుడు కేసులు పెట్టించడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనమని బీఆర్ఎస్ బృందం కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
మహిళా కానిస్టేబుళ్లను దారికి అడ్డంగా ఉండవద్దని తమ ఎమ్మెల్యేలు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వినలేదని, తీరా కేసు పెట్టిన సదరు కానిస్టేబుల్‌ను స్వయంగా స్పీకర్ సన్మానించడం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ప్రజలు గమనించాలని, ఆ కానిస్టేబుల్‌తో అబద్ధాలు చెప్పిస్తూ వేధిస్తున్నదే కాంగ్రెస్ నేతలేనని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ కమిషన్లను కలిసిన ప్రతినిధి బృందం లో ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోవా లక్ష్మి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం నుంచి బీఎస్ ప్రసాద్, సోమా భరత్, లలితారెడ్డి తదితరులు ఉన్నారు.